భక్తులతో దురుసుగా ప్రవర్తిస్తే సహించేది లేదు..
- విధుల్లో మొబైల్ వినియోగంపై నిషేధం..
- మర్యాదగా వ్యవహరించని గార్డులకు స్పాట్లోనే తొలగింపు..
- పార్కింగ్ నిర్వహణ మెరుగుపర్చాలి
- దుర్గగుడి ఈవో శీనా నాయక్
( ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ) : విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో భక్తుల పట్ల సెక్యూరిటీ సిబ్బంది దురుసు ప్రవర్తన, విధుల్లో నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఈఓ వి.కె. సీనా నాయక్, అజైల్ సెక్యూరిటీ ఏజెన్సీకి కఠిన హెచ్చరిక జారీ చేశారు.
భక్తుల గౌరవం, భద్రతకు భంగం కలిగించే చర్యలను ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఈఓ శీనా నాయక్ మాట్లాడుతూ, విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది మొబైల్ ఫోన్ల వినియోగానికి పూర్తిగా దూరంగా ఉండాలని ఆదేశించారు. సెల్ఫోన్లలో నిమగ్నమై విధులను నిర్లక్ష్యం చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

భక్తులతో మర్యాదగా, సహనంతో వ్యవహరించాలని, అసభ్యంగా మాట్లాడినా, దురుసుగా ప్రవర్తించినా లేదా నెట్టివేసినా సంబంధిత గార్డును వెంటనే విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తామని స్పష్టం చేశారు. ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులను సెక్యూరిటీ సిబ్బంది తప్పనిసరిగా “జై భవానీ” అంటూ సాంప్రదాయబద్ధంగా స్వాగతించాలని సూచించారు.
ఆలయ పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాల నిర్వహణ సరిగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఈఓ, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే ప్రతిరోజూ సెక్యూరిటీ సిబ్బంది డ్యూటీలను మార్చి డ్యూటీ చార్ట్‌ను తన ముందుంచాలని సూచించారు. నిబంధనలు పాటించని సెక్యూరిటీ సిబ్బందిపై వ్యక్తిగతంగా చర్యలు తీసుకోవడంతో పాటు, అజైల్ సెక్యూరిటీ ఏజెన్సీపై భారీ జరిమానాలు విధించడం, అవసరమైతే కాంట్రాక్టును రద్దు చేయడానికీ వెనుకాడబోమని ఈఓ శీనా నాయక్ హెచ్చరించారు.
