మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డిపై కేసు నమోదు
ఆయనతో పాటు మరో 20మందిపై కూడా..
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: ఉరవకొండ నియోజకవర్గంలో చోటుచేసుకున్నట్లు ఆరోపిస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు, భూ ఆక్రమణలకు నిరసనగా నిర్వహించ తలపెట్టిన ధర్నా నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డితో పాటు మరో 20 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేశారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా పోలీసు వాహనాలకు అడ్డంగా ఆక్సిజన్ సిలిండర్లు, బండ రాళ్లు వేసి రాకపోకలకు అంతరాయం కలిగించారని, పోలీసు వాహనాలకు నిప్పంటించే ప్రయత్నం చేశారని ఆరోపణలు ఉన్నాయి.
పోలీసుల అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహించడం, సెక్షన్-30 పోలీస్ యాక్ట్ ఉల్లంఘన, ఇతర ఆరోపణలపై బీఎన్ఎస్, ఐపీఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డితో పాటు మరో 20 మందిని నిందితులుగా చేర్చినట్లు తెలిపారు.
