కొబ్బరికాయల కత్తితో వ్యక్తిపై దాడి..

గంజాయి ముఠాల వివాదమే కారణమా?

హైదరాబాద్: సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. హమేర్ (35) అనే వ్యక్తిని ఓ యువకుడు కొబ్బరికాయలు కోసే కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

స్థానికుల సమాచారం ప్రకారం.. సింగరేణి కాలనీలో హమేర్‌పై ఓ యువకుడు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. కొబ్బరికాయలు కోసే కత్తితో పలుమార్లు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన హమేర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

సమాచారం అందుకున్న సైదాబాద్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రాథమిక విచారణలో ఈ హత్యకు గంజాయి ముఠాల మధ్య నెలకొన్న వివాదమే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పాత కక్షలు, ముఠాల మధ్య ఆధిపత్య పోరు కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. సింగరేణి కాలనీ పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుడి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ ఘటనతో సింగరేణి కాలనీ వాసుల్లో ఆందోళన నెలకొంది. మాదకద్రవ్యాల ముఠాల కదలికలపై పోలీసులు మరింత నిఘా పెంచాలని స్థానికులు కోరుతున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.