మండలి వెంకటకృష్ణారావు సేవలు చిరస్మరణీయం: వక్తలు
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం మాజీ పార్లమెంట్ సభ్యుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ విద్యాశాఖ మంత్రి దివంగత మండలి వెంకటకృష్ణారావు శత జయంతి వేడుకలను జిల్లా గ్రంథాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.
కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ డిప్యూటీ లైబ్రేరియన్ బీరం వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ, జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజు, సాహితి మిత్రుల సంస్థ కార్యదర్శి మేడిశెట్టి యోగేశ్వరరావు, ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత బి. రమేష్, విశ్రాంత జిల్లా గ్రంథాలయ ఉద్యోగి ఐ.వి.వి. రామారావు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ, ఉన్నత విలువలు, నీతి, నిజాయితీతో ప్రజాసేవ చేసిన మండలి వెంకటకృష్ణారావు నేటి రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయమని అన్నారు. మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడిగా, ఉమ్మడి రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. మండలి శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని జీవో జారీ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజు మాట్లాడుతూ, దివిసీమ ఉప్పెన సమయంలో మండలి వెంకటకృష్ణారావు చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలను భారతదేశంతో పాటు మలేషియాలో నిర్వహించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.

ఇతర వక్తలు కూడా మండలి వెంకటకృష్ణారావు వ్యక్తిత్వం, ప్రజాసేవ, విద్యా, సాంస్కృతిక రంగాలకు ఆయన చేసిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. అనంతరం మండలి వెంకటకృష్ణారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు, ప్రజలు పాల్గొన్నారు.
