మండలి వెంకటకృష్ణారావుకి ఘన నివాళులు

గుంటూరు, ఆంధ్రప్రభ: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త, తెలుగు భాషా–సంస్కృతి పరిరక్షకుడు, మాజీ విద్యాశాఖ మంత్రి మండలి వెంకటకృష్ణారావు శత జయంతి సందర్భంగా మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు.జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి సేవలను స్మరించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. మండలి వెంకటకృష్ణారావు విద్యారంగం, తెలుగు భాషాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, సామాజిక సేవా రంగాల్లో విశిష్ట సేవలు అందించారని తెలిపారు. ప్రజాసేవనే జీవిత ధ్యేయంగా భావించి నిరాడంబర జీవనం సాగించిన ఆయనను ప్రజలు “దివిసీమ గాంధీ”గా గౌరవించారని పేర్కొన్నారు.

మండలి వెంకటకృష్ణారావు ఆశయాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. ఆయన శత జయంతి ఉత్సవాలను 2026లో రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక అధికారి రమ్య, స్టెప్ సీఈఓ సత్యనారాయణతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.