అస్వస్థతకు గురైన విద్యార్థులకు పరామర్శ..

  • పరామర్శించిన రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
  • హోటళ్ల నాణ్యతపై ప్రత్యేక తనిఖీలకు ఆదేశాలు

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : అస్వస్థతకు గురై మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. మంగళవారం ఉదయం ఆస్పత్రికి వెళ్లిన ఆయన విద్యార్థులకు అందుతున్న వైద్య సేవలపై వైద్యులను అడిగి తెలుసుకుని, చికిత్స వివరాలను సమీక్షించారు.

అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, నిన్న ఉదయం వ్యాక్సిన్ తీసుకున్న కొద్దిసేపటికే కొందరు విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో వారిని వెంటనే ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే వైద్యులతో మాట్లాడి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించినట్లు చెప్పారు.

మచిలీపట్నంలో 140 మందికి, జిల్లా వ్యాప్తంగా 750 మందికి వ్యాక్సిన్ అందించగా, అందులో ఎనిమిది మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు వెల్లడించారు.

వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం విద్యార్థులు చికెన్ బిర్యానీ తిన్నట్లు సమాచారం అందిందని, బయటి ఆహారం తీసుకోవడం వల్లే అస్వస్థతకు గురై ఉండే అవకాశం ఉందని ప్రాథమికంగా అనుమానిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అయితే పూర్తి స్థాయి వైద్య నివేదిక వచ్చిన తర్వాతే అసలు కారణం వెల్లడవుతుందని, అనంతరం అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

హోటళ్లలో నాణ్యతా ప్రమాణాలను అధికారులు కచ్చితంగా పరిశీలించేలా ఆదేశిస్తామని, ప్రజలు కూడా బయట ఆహారం తీసుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు.