Delhi | మోడీ నివాసానికి కేజ్రీవాల్ పాదయాత్ర…
రోడ్డుపై బైఠాయించిన కేజ్రీవాల్
Delhi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఈ-20 పెట్రోల్ విధానానికి వ్యతిరేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించేందుకు పాదయాత్రగా బయల్దేరిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను పోలీసులు మంగళవారం అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పోలీసుల చర్యను నిరసిస్తూ కేజ్రీవాల్‌తో పాటు 100 మందికిపైగా ఆప్ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఈ-20 పెట్రోల్ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, పెట్రోల్‌లో కల్తీని ఆపాలని నినాదాలు చేశారు.
ఆందోళన సందర్భంగా మాట్లాడిన కేజ్రీవాల్, “మేము ఉగ్రవాదులం కాదు.. ఈ-20 ఇంధనంపై ప్రజల ఆందోళనలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లేందుకే వచ్చాం. మాకు ప్రధానిని కలిసే అవకాశం ఇవ్వాలి” అని డిమాండ్ చేశారు. అయితే భద్రతా కారణాలను చూపిస్తూ పోలీసులు వారిని ముందుకు వెళ్లనివ్వకుండా అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తత కొనసాగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు.
