రూ.52కే నాణ్యమైన సోనామసూరి బియ్యం
- నిడదవోలులో ప్రత్యేక అవుట్లెట్ ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్
- తూర్పుగోదావరి జిల్లాలో 45 కేంద్రాల ద్వారా సరఫరా
నిడదవోలు, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరల్లో అందించాలనే లక్ష్యంతో నిడదవోలు పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో రైతు బజార్లు, రైస్ మిల్లుల ప్రత్యేక అవుట్లెట్ల ద్వారా తక్కువ ధరకే సన్నబియ్యం విక్రయ కార్యక్రమాన్ని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలకు సన్నబియ్యాన్ని పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. బహిరంగ మార్కెట్లో కిలో రూ.60 నుంచి రూ.65 వరకు విక్రయమవుతున్న నాణ్యమైన సోనామసూరి బియ్యాన్ని ప్రభుత్వం కేవలం కిలో రూ.52కే ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ప్రతి వ్యక్తి లేదా కుటుంబానికి నెలకు గరిష్టంగా 10 కిలోల చొప్పున బియ్యం అందజేస్తామని తెలిపారు.
ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 45 కేంద్రాల ద్వారా బియ్యం సరఫరా జరుగుతోందని వెల్లడించారు. ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించేందుకు నిడదవోలు నియోజకవర్గంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో మరిన్ని ప్రత్యేక అవుట్లెట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు.
ధనిక–పేద అనే తేడా లేకుండా ప్రతి కుటుంబం నాణ్యమైన బియ్యం తినాలన్నదే కూటమి ప్రభుత్వ సంకల్పమని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమన్వయంతో ప్రజలకు మేలు చేసే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.
ప్రజలకు నాణ్యమైన ఆహార ధాన్యాలను అందుబాటు ధరల్లో అందించడం ద్వారా కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించడంతో పాటు మెరుగైన ఆహార భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
