భూ రీ-సర్వేకు వేగం పెంచాలి
షెడ్యూల్ను ముందుగానే రైతులకు తెలియజేయాలి:
హనుమకొండ ఇన్చార్జి కలెక్టర్ ఎన్. రవి
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి వరంగల్ : భూముల రీ-సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎన్. రవి సర్వేయర్లను ఆదేశించారు. సర్వేకు సంబంధించిన వివరాలను ముందుగానే రైతులకు తెలియజేసి వారి సహకారంతో పనులు చేపట్టాలని సూచించారు.
మంగళవారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంథిని గ్రామంలో భూములు కొలతల శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న భూముల రీ-సర్వే పనులను ఇన్చార్జి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా గ్రామంలో ఇప్పటివరకు ఎన్ని ఎకరాల భూమికి రీ-సర్వే పూర్తయిందని, రోజువారీగా ఎంత విస్తీర్ణంలో సర్వే నిర్వహిస్తున్నారని, ఎన్ని రోవర్ పరికరాలతో పనులు కొనసాగుతున్నాయని సర్వేయర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం రైతులతో మాట్లాడిన ఇన్చార్జి కలెక్టర్.. రీ-సర్వే ప్రక్రియ పురోగతి, ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. ప్రస్తుతం గ్రామంలో రెండు సర్వే బృందాలు రీ-సర్వే పనులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎన్. రవి మాట్లాడుతూ ప్రతి సర్వే బృందం రోజుకు కనీసం 75 ఎకరాల భూమిని రీ-సర్వే చేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. సర్వే ప్రారంభానికి ముందే కార్యాచరణ సిద్ధం చేసి, ఆయా ప్రాంతాల రైతులకు తేదీలు, సమయాలపై సమాచారం అందించాలని ఆదేశించారు.
రైతుల సమన్వయంతో నిర్ణీత లక్ష్యాల మేరకు ప్రతిరోజూ రీ-సర్వే చేపడితే గడువులోగా ప్రక్రియ పూర్తి చేయవచ్చని పేర్కొన్నారు. సర్వే పనుల్లో వేగంతో పాటు నాణ్యత, పారదర్శకత పాటించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ పరిశీలనలో భూములు కొలతల శాఖ సహాయ సంచాలకులు నూర్ సింగ్, ఐనవోలు తహసీల్దార్ విక్రమ్ కుమార్, సర్వేయర్ సూరజ్ కుమార్, జీపీవో శ్రీకాంత్, స్థానిక రైతులు పాల్గొన్నారు.
