మూలవాగు ప్రాజెక్టు కట్టకు మళ్లీ ప్రమాద హెచ్చరిక

ఎడమ కాలువ వద్ద భారీ బుంగ.. వెంటనే మరమ్మతులు చేపట్టాలని రైతుల డిమాండ్

కోనరావుపేట, ఆంధ్రప్రభ: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్టు ఎడమ కాలువ వద్ద ఉన్న కట్టకు మరోసారి భారీ బుంగ పడడంతో ప్రమాద పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు ఘటన స్థలానికి చేరుకుని సంబంధిత అధికారులు, జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందించారు.

గత వారం ఇదే ఎడమ కాలువ తూము వద్ద బుంగ పడగా నీటిపారుదల శాఖ సిబ్బంది తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు. అయితే ఆ మరమ్మతుల అనంతరం కట్ట పరిస్థితిని, నీటిమట్టం పెరిగిన తర్వాత భద్రతను అధికారులు సమగ్రంగా పరిశీలించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

కోనరావుపేట మండలంలోని సుమారు 3,000 ఎకరాలకు సాగునీరు అందించే నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్టుపై అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లే ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని రైతులు, ప్రజాప్రతినిధులు విమర్శిస్తున్నారు.

దాదాపు 50 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రాజెక్టు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే కీలక సాగునీటి వనరని పేర్కొంటూ, నిర్లక్ష్యం కారణంగా కట్టకు మరింత ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రాజెక్టు కట్టను ఉన్నతాధికారులు వెంటనే పరిశీలించి, శాశ్వత మరమ్మతులు చేపట్టి ప్రమాదాన్ని నివారించాలని రైతులు, స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు.