హైదరాబాద్‌కు గర్వకారణం..
- తొలి స్వదేశీ టర్బోజెట్ ఇంజిన్ తయారీ
- అజాద్ ఇంజినీరింగ్, డీఆర్‌డీఓ బృందాలకు కేటీఆర్ అభినందనలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : భారత రక్షణ రంగంలో కీలక ముందడుగు పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దేశంలోనే తొలిసారిగా 350 కిలోల థ్రస్ట్-క్లాస్ ఎక్స్‌పెండబుల్ టర్బోజెట్ ఇంజిన్‌ను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయడం గర్వకారణమని పేర్కొన్నారు.
హైదరాబాద్‌కు చెందిన అజాద్ ఇంజినీరింగ్, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) బృందాలను కేటీఆర్ అభినందించారు. ఈ ఇంజిన్ తయారీ భారత్ స్వదేశీ ప్రొపల్షన్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని, రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా ఇది కీలక విజయమని తెలిపారు.
జెట్ ఇంజిన్ సాంకేతికతలో అత్యున్నత స్థాయి ఖచ్చితత్వం, ఆధునిక లోహ సాంకేతికత, ప్రపంచ స్థాయి తయారీ నైపుణ్యం అవసరమని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ ఏరోస్పేస్, ప్రెసిషన్ ఇంజినీరింగ్ రంగాల సామర్థ్యానికి ఈ విజయం నిదర్శనమన్నారు.
గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఏరోస్పేస్, రక్షణ తయారీ రంగాలు బలపడటం ఇలాంటి విజయాలకు పునాదిగా నిలిచిందని తెలిపారు. చారిత్రాత్మక విజయాన్ని సాధించిన అజాద్ ఇంజినీరింగ్, డీఆర్‌డీఓ బృందాలకు మరోసారి అభినందనలు తెలిపారు.
