ఉర్దూ అందరిదీ.. ఉర్దూ అభివృద్ధి అందరి బాధ్యత !
- ఏపీ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ ఫరూఖ్ షిబ్లీ
విజయవాడ, ఆంధ్రప్రభ : మొగల్రాజపురంలోని ఫరూఖ్ షిబ్లీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ జనాబ్ మహమ్మద్ ఫరూఖ్ షిబ్లీ, ఆగస్టు 2న కడపలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో “ఉర్దూ కి ఉడాన్ – ఉర్దూ సాహిత్య వికాసం” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉర్దూ భాషను ఒక మతానికి పరిమితమైన భాషగా కాకుండా భారతీయ సాంస్కృతిక వారసత్వానికి, సామరస్యానికి ప్రతీకగా ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ముస్లిమేతర ఉర్దూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పరిశోధకులు, ఉర్దూ పండితులను ఒకే వేదికపై సత్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. కడపలోని హరిప్రియ ఫంక్షన్ హాల్‌లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.
ఉర్దూ భాషపై ఉన్న అపోహలను తొలగించడం, అన్ని వర్గాల ప్రజలను ఉర్దూ భాష, సాహిత్యంతో అనుసంధానం చేయడం, యువతకు ఉర్దూ ద్వారా విద్య, ఉపాధి, పరిశోధన, అనువాదం, డిజిటల్ మీడియా వంటి రంగాల్లో ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వివరించారు.
ఈ సందర్భంగా ఫరూఖ్ షిబ్లీ మాట్లాడుతూ, “ఉర్దూ ఒక భాష.. మతం కాదు. ఉర్దూ అందరిదీ.. ఉర్దూ అభివృద్ధి అందరి బాధ్యత. ఉర్దూను పరిరక్షించడమే కాదు, ఆధునిక అవకాశాలతో అనుసంధానం చేసి యువత భవిష్యత్తుకు ఉపయోగపడే భాషగా తీర్చిదిద్దాలి” అని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉర్దూ భాషాభిమానులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సాహితీవేత్తలు, పరిశోధకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
