ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేస్తూ ఘోర ప్రమాదం
- ఎదురెదురుగా ఢీకొన్న రెండు కార్లు..
- ఇద్దరికి తీవ్ర గాయాలు
మేడిపల్లి, ఆంధ్రప్రభ: జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో శనివారం రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంతో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, అరుణ్, నందకిషోర్ కోరుట్లలో ఏటీఎంలో నగదు లోడ్ చేసి టీఎస్-16 ఈజీ 9726 నంబర్ గల కే-10 కారులో జగిత్యాలకు వెళ్తున్నారు. అదే సమయంలో జగిత్యాలకు చెందిన దంతవైద్యుడు ప్రణయ్ టీజీ-08 ఎం 3220 నంబర్ గల టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారులో జగిత్యాల నుంచి మెట్‌పల్లి వైపు వెళ్తున్నారు.
ఈ క్రమంలో ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో అరుణ్, నందకిషోర్ తీవ్రంగా గాయపడగా, వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చినా, దాదాపు 50 నిమిషాల పాటు అంబులెన్స్ రాకపోవడంతో, గాయపడిన వారిని స్థానికులు ఆటోలో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
