మండలంలో మంత్రి సీతక్క పర్యటన..

  • వరద ముంపు గ్రామాల పరిశీలన
  • బాధిత కుటుంబాలకు పరామర్శ

వాజేడు, ఆంధ్రప్రభ : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ (సీతక్క) శనివారం వాజేడు మండలంలో పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ముంపు గ్రామాల్లో బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

మండలంలోని చీకుపల్లి–పెద్దగొల్లగూడెం గ్రామాల మధ్య ఉన్న ఇసుకవాగు వంతెన వద్ద గోదావరి వరదల కారణంగా అప్రోచ్ రోడ్డు దెబ్బతినడంతో, ప్రజలకు రాకపోకలు సౌకర్యవంతంగా ఉండేలా తక్షణమే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.

అనంతరం బొగత జలపాతాన్ని సందర్శించిన మంత్రి, పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రమాదాలను నివారించేందుకు హెచ్చరిక బోర్డులు, భద్రతా చర్యలు సమర్థంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే పర్యాటకులు కూడా అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.

వరదల సమయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ లోతట్టు ప్రాంత ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

కాంగ్రెస్ సీనియర్ నాయకుడి కుటుంబానికి పరామర్శ

వాజేడు మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దంతులూరి విశ్వనాథ ప్రసాద్ రాజు ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా, మంత్రి సీతక్క ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. విశ్వనాథ ప్రసాద్ రాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి, ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన నాయకుడిగా ఆయన సేవలను గుర్తుచేసి, కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

ఇటీవల వాజేడు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఇల్లు పూర్తిగా దగ్ధమై సర్వం కోల్పోయిన చందనం రాజు కుటుంబాన్ని మంత్రి సీతక్క పరామర్శించారు. ప్రభుత్వ తరఫున మంజూరైన రూ.12 వేల ఆర్థిక సాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రూ.20 వేల నగదు, బియ్యం, వంట సామగ్రి, దుస్తులను అందించారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో పాటు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ నాయకులు ఇరుసవడ్ల ఎంకన్న, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, కాంగ్రెస్ నాయకులు కాకర్లపూడి విక్రాంత్, జిల్లా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు చెన్నం ఎల్లయ్య, సొసైటీ ఉపాధ్యక్షుడు జగన్నాథరాజు, నాగారం సర్పంచ్ బోధబోయిన స్వరూప, దాట్ల సీతారామరాజు, మాజీ జెడ్పీటీసీ తల్లాడి పుష్పలత, తల్లాడి ఆదినారాయణ, మందపాటి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.