గ్రామాల్లో తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
విద్యుత్ అధికారుల పనితీరుపై సర్పంచుల ఆగ్రహం
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఎంపీడీవో ఎన్. విజయ్‌కుమార్ అధ్యక్షతన శనివారం మండల సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి జెడ్పీ సీఈవో, అదనపు కలెక్టర్ శేషాద్రి, ప్రత్యేక అధికారి డి. ఆదిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అవసరమైన జాగ్రత్తలు తీసుకునేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని, సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని మండల స్థాయి అధికారులకు సూచించారు.
వ్యవసాయ అధికారి రాజ్‌కుమార్ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం కారణంగా వ్యవసాయం, ఉద్యానవనం, విద్యుత్ తదితర రంగాలపై ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉందన్నారు. రైతులు పూర్తిగా వర్షాధార పంటలపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు.
దండేపల్లి గ్రామ సర్పంచ్ గొల్లె సంపత్ మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, విద్యుత్ అధికారుల పర్యవేక్షణ కరువైందని ఆరోపించారు. గ్రామ పంచాయతీలకు సంబంధించిన వీధి దీపాలు, తాగునీటి మోటార్ల విద్యుత్ బిల్లులను ప్రభుత్వం మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
కోతులనడుమ గ్రామ సర్పంచ్ లింగన్న, ఆరేపల్లి సర్పంచ్ స్రవంతి రాజు మాట్లాడుతూ బావుపేట–ఆరేపల్లి గ్రామాలకు హద్దులు ఏర్పాటు చేయాలని కోరారు.
గ్రామాల్లో విద్యుత్ శాఖ అధికారుల పనితీరు సంతృప్తికరంగా లేదని, చిన్నచిన్న పనులకూ నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని సర్పంచులు మండిపడ్డారు. గ్రామాల సమస్యల పరిష్కారంలో అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
ఈ సమావేశంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పుల్లూరి శ్రీధర్‌రావుతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, మండల స్థాయి అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
