Mock Parliament | ఆకట్టుకున్న కిషోర బాలికల మాక్ పార్లమెంట్

Mock Parliament | ఆకట్టుకున్న కిషోర బాలికల మాక్ పార్లమెంట్

  • ప్రజాస్వామ్య విలువల పెంపుకు దోహదం

వరంగల్, ఆంధ్రప్రభ: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా, మహిళా శక్తి వారోత్సవాల్లో భాగంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో శనివారం జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ హాల్‌లో స్నేహ సంఘ కిషోర బాలికలతో నిర్వహించిన మాక్ పార్లమెంట్ కార్యక్రమం పిల్లలను ఆకట్టుకుంది.

మాక్ పార్లమెంట్‌లో విద్య, ఆరోగ్యం, భద్రత, ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు, రవాణా, మౌలిక వసతులు, రక్తహీనత, స్నేహ సంఘాల అవసరం, బాలికల సాధికారత వంటి అంశాలపై చర్చలు, ప్రశ్నోత్తరాలు ఆసక్తికరంగా సాగాయి. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకులు, పాలకపక్ష సభ్యులు, రిపోర్టర్లు, తీర్మానాల కమిటీ సభ్యుల పాత్రలను బాలికలు సమర్థంగా పోషిస్తూ పార్లమెంట్ విధానాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు.

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఈ కార్యక్రమానికి హాజరై బాలికలను అభినందించారు. ఈ సందర్భంలో, “కిషోర బాలికల్లో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంపొందించేందుకు మాక్ పార్లమెంట్ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి. విద్య, ఆరోగ్యం, భద్రత, మౌలిక వసతులు వంటి కీలక అంశాలపై బాలికలు నిర్భయంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం అభినందనీయమని” తెలిపారు.

డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ.. “సమస్యలను గుర్తించడంతో పాటు వాటి పరిష్కారాలపై సూచనలు చేయడంతో… వారి ఆలోచనా సామర్థ్యం, నాయకత్వ నైపుణ్యాలు భవిష్యత్తులో సమాజ అభివృద్ధికి, దేశ నిర్మాణానికి అవసరం. స్నేహ కార్యక్రమాన్ని సేఫ్టీ, న్యూట్రిషన్, ఎడ్యుకేషన్, హెల్త్ అనే కాన్సెప్ట్‌ ప్రకారం ఏర్పాటు చేసి, యూనిసెఫ్ ఆధ్వర్యంలో పైలెట్ ప్రాజెక్ట్‌గా వరంగల్ జిల్లాలో ప్రారంభించాం. దీన్ని 33 జిల్లాలలో విస్తరించనున్నాం అని తెలిపారు.

ఈ గ్రూప్ ద్వారా పిల్లలకు అవగాహన కల్పించడం, సమస్యలపై పరిష్కార సూచనలు చేయడం, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేయడం సాధ్యమైందని, బాలికలు తమ అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో.. ‘ఉల్లాస్–అమ్మకు అక్షరమాల’ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన వాలంటీర్లు, లెర్నర్లను సన్మానించారు. అనంతరం వైద్య శాఖ సహకారంతో కిషోర బాలికలు, మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంత‌రం, రాణి రుద్రమదేవి జిల్లా మహిళా సమాఖ్య ప్రత్యేక సాధారణ సమావేశం నిర్వహించి, మహిళలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.

ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి, జడ్పీ సీఈఓ రాం రెడ్డి, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, డీఈఓ రంగయ్యనాయుడు, డీడబ్ల్యూఓ రాజమణి, డీపీఎంలు, ఏపీఎంలు, SERP సిబ్బంది, వివిధ గ్రామాల వీఓఏలు పాల్గొన్నారు.

Leave a Reply