మహిళా సంఘాలకు కీలక బాధ్యత

జలసిరి కార్యక్రమంపై అధికారులకు ఎంపీడీవో సంతోష్ కుమార్ దిశానిర్దేశం

భీమ్‌గల్ టౌన్/రూరల్, ఆంధ్రప్రభ : జలసిరి కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా మహిళా స్వయం సహాయక సంఘాలు ప్రత్యేక కృషి చేయాలని భీమ్‌గల్ ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ సూచించారు.

శనివారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇందిరా క్రాంతి పథకం (ఐకేపీ), మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సిబ్బందితో జలసిరి కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతల నిర్మాణానికి మహిళా సంఘాల ద్వారా లబ్ధిదారులను గుర్తించాలని ఆదేశించారు.

తొలి విడతలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో 50, గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్ సమన్వయంతో మరో 50 ఇంకుడు గుంతలు నిర్మించి, మొత్తం 100 ఇంకుడు గుంతలను ఆగస్టు 15లోగా పూర్తి చేయాలని సూచించారు.

అదేవిధంగా ప్రతి గ్రామంలో రైతుల పొలాల్లో ఫారం పాండ్లు, వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, మినీ వాటర్ ట్యాంకుల వద్ద కమ్యూనిటీ సోక్‌పిట్స్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో ఏపీఎం ప్రమీల, ఏపీవో నర్సయ్య, ఈసీ చందు, ఐకేపీ సీనియర్ సీసీలు కుంట శ్రీనివాస్, పురస్తు నరేష్, సాయిలు, టెక్నికల్ అసిస్టెంట్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.