అర్హులైన జర్నలిస్టులకు అండగా టిడబ్ల్యూజేఎఫ్

ఖమ్మం, ఆంధ్రప్రభ: అర్హులైన వర్కింగ్ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఖదీర్ అన్నారు. శనివారం ఖమ్మంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఫ్రీలాన్స్ అక్రిడిటేషన్ కార్డులను ఖమ్మం ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొరకొప్పుల రాంబాబు, యూనియన్ జిల్లా నాయకుడు కృష్ణమాచార్యులకు ఆయన అందజేశారు.

ఈ సందర్భంగా ఖదీర్ మాట్లాడుతూ, సమాజానికి, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న ప్రతి అర్హత కలిగిన వర్కింగ్ జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు లభించడం వారి ప్రాథమిక హక్కు అని అన్నారు. అక్రిడిటేషన్ దరఖాస్తులు, ఆన్‌లైన్ ప్రక్రియలో అవగాహన కల్పిస్తూ అర్హులైన జర్నలిస్టులకు టిడబ్ల్యూజేఎఫ్ పూర్తి సహకారం అందించిందని తెలిపారు. ఫెడరేషన్ కృషి ఫలితంగానే అర్హులైన పలువురు వర్కింగ్ జర్నలిస్టులకు ఫ్రీలాన్స్ అక్రిడిటేషన్ కార్డులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు షేక్ జానీపాషా, లక్ష్మారెడ్డి, చౌదరి తదితరులు పాల్గొన్నారు.