Us-Iran-War-Oil-Price-Hormuz-Strait-Impact-India | అమెరికా-ఇరాన్ యుద్ధ మేఘాలు.. ముడి చ‌మురు బ్యారెల్‌కు 90 డాలర్లు..

US-Iran War, Oil Prices, Brent Crude, Hormuz Strait, Crude Oil, Petrol Prices, Global Economy, India Oil Imports, Middle East Crisis, Energy Market

Us-Iran-War-Oil-Price-Hormuz-Strait-Impact-India |ఆంధ్రప్రభ వెబ్, అంతర్జాతీయ ప్రతినిధి : పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. కాల్పుల విరమణ ప్రకటనలు వచ్చిన ప్రతిసారీ పరిస్థితులు చల్లబడతాయనుకుంటున్న సమయంలో… అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస హెచ్చరికలు, ఇరాన్ నుంచి వస్తున్న ప్రతిస్పందనలు మరోసారి ప్రపంచాన్ని ఆందోళనలోకి నెట్టేశాయి. యుద్ధం కేవలం క్షిపణులు, బాంబులతో మాత్రమే సాగదు… చమురు కూడా ఓ ఆయుధంగా మారుతుందనే విషయాన్ని ప్రపంచం మరోసారి గుర్తు చేసుకుంటోంది.

ఇరాన్ హోర్ముజ్ జలసంధిపై నియంత్రణను కఠినతరం చేస్తామని హెచ్చరించడం, అమెరికా సైనిక చర్యలపై అనిశ్చితి నెలకొనడం, చమురు ట్యాంకర్ల భద్రతపై సందేహాలు పెరగడం… ఈ పరిణామాలన్నీ కలిసి అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలను వేగంగా పైకి లాగుతున్నాయి.

ప్రపంచాన్ని నడిపించే హోర్ముజ్ జలసంధి

పర్షియన్ గల్ఫ్‌ను అరేబియా సముద్రంతో కలిపే హోర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన భద్రతకు గుండెకాయగా చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే ముడి చమురులో దాదాపు 20 శాతం ఈ మార్గం ద్వారానే రవాణా అవుతోంది. సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఇరాక్, ఖతార్ వంటి దేశాల చమురు ఎగుమతులన్నీ దాదాపుగా ఈ మార్గంపైనే ఆధారపడి ఉన్నాయి. అందుకే ఇక్కడ చిన్న ఉద్రిక్తత వచ్చినా ప్రపంచ మార్కెట్లు వెంటనే స్పందిస్తాయి.

ఇరాన్ చేతిలో ఉన్న అతిపెద్ద ఆయుధం ఇదే..!

సైనికపరంగా అమెరికాతో సమాన శక్తి లేకపోయినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపే శక్తి మాత్రం ఇరాన్‌కు ఉంది. అందేమిటంటే ఉద్రిక్త‌త‌లు స‌మ‌యంలో హోర్ముజ్ జలసంధిలో నౌకాయానానికి ఆటంకాలు క‌ల్పించ‌డం, చ‌మురు ట్యాంకర్లపై డ్రోన్, క్షిపణి దాడులకు పాల్ప‌డ‌టం, సముద్ర రవాణా బీమా వ్యయాల పెరుగుదలతో
చమురు సరఫరాపై అనిశ్చితి నెల‌కొంటుంది. ఈ ఒక్క భయమే మార్కెట్‌ను కుదిపేస్తోంది.

జూన్‌లో 64 డాలర్లు… ఇప్పుడు 90 డాలర్ల మార్క్

యుద్ధ వాతావరణం నెలకొనే ముందు 2026 జూన్‌లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ (159 లీట‌ర్లు) కు 64 నుంచి 66 డాలర్ల మధ్య ఉండేది. అమెరికా WTI క్రూడ్ ధర 61 నుంచి 63 డాలర్ల వద్ద ట్రేడయ్యేది. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారింది.

అంటే రెండు నెలల్లోనే బ్రెంట్ క్రూడ్ ధర దాదాపు 40 శాతం వరకు పెరిగింది.

ప్రపంచంలో చమురు నిల్వలు ఎంత?

ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, చమురు సంస్థలు, వ్యూహాత్మక నిల్వ కేంద్రాల్లో కలిపి ప్రస్తుతం 7.5 నుంచి 8 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నట్లు అంచనా. వాటిలో
వాణిజ్య నిల్వలు : 4.5–5 బిలియన్ బ్యారెళ్లు
ముంద‌స్తు నిల్వలు : 2.5–3 బిలియన్ బ్యారెళ్లు

నిల్వలు తగ్గుతున్నాయా?

పూర్తిగా కొరత ఏర్పడలేదుగానీ… ఆందోళన కలిగించే సంకేతాలు మాత్రం కనిపిస్తున్నాయి. అమెరికా విడుదల చేసిన ముంద‌స్తు నిల్వలు ఇంకా పూర్తిగా భర్తీ కాలేదు. OECD దేశాల వాణిజ్య నిల్వలు ఐదేళ్ల సగటు కంటే కొద్దిగా తక్కువ స్థాయిలో ఉన్నాయి. చైనా, భారత్ వంటి దేశాలు ముంద‌స్తు నిల్వలను జాగ్రత్తగా వినియోగిస్తున్నాయి.
అంటే ప్రస్తుతం సమస్య చమురు కొరత కాదు… భవిష్యత్ సరఫరాపై అనిశ్చితి.

ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

చమురు ధరలను కేవలం నిల్వలు నిర్ణయించవు. ప్రస్తుతం మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్న అంశాలు నిర‌ణ‌యిస్తాయి. హోర్ముజ్ మూసివేత భయం, చమురు ట్యాంకర్ల భద్రత, బీమా ఖర్చుల పెరుగుదల,
సరఫరా అంతరాయం ఏర్పడే అవకాశం వెంటాడుతున్న భ‌యంతో అంతర్జాతీయ పెట్టుబడిదారుల ఊహాగానాలతో పాటు సరఫరా తగ్గొచ్చు అనే వార్తే ధరలను పెంచుతోంది.

హోర్ముజ్ మూసేస్తే… ప్రపంచానికి షాక్

రోజుకు సుమారు 20 మిలియన్ బ్యారెళ్ల చమురు హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తుంది. ఈ మార్గం మూసుకుపోతే… ప్రపంచ చమురు సరఫరా తీవ్రంగా దెబ్బతింటుంది. చమురు ధరలు మరింత ఎగిసే అవకాశం ఉంటుంది. ప్రపంచ ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది.

భారత్‌పై ఎంత ప్రభావం?

భారత్ రోజుకు సుమారు 5.5 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును వినియోగిస్తోంది. అందులో 85 శాతానికి పైగా దిగుమతులే. గల్ఫ్ దేశాల నుంచే ఎక్కువ చమురు వస్తుండటంతో హోర్ముజ్‌లో సంక్షోభం పెరిగితే… పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఎల్పీజీ సిలిండర్ ధ‌ర‌ల‌పై ప్ర‌భావం ఉంటుంది. అలాగే రవాణా ఖర్చులు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం త‌ద్వారా ద్రవ్యోల్బణం, రూపాయి విలువపై ప్రభావం

నిపుణులు ఏమంటున్నారు?

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్నది చమురు కొరత కాదు… చమురు సరఫరాపై నెలకొన్న అనిశ్చితి. ప్రపంచ నిల్వలు ఇంకా గణనీయంగానే ఉన్నప్పటికీ, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరింత తీవ్రమై హోర్ముజ్ జలసంధిలో రవాణా నిలిచిపోతే పరిస్థితి వేగంగా మారే అవకాశం ఉంది. మార్కెట్ ఇప్పటికే ఆ ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేసి ధరలను పెంచుతోంది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో యుద్ధం ప్రభావం కేవలం యుద్ధభూమికే పరిమితం కాదు. క్షిపణి పేలుళ్లకు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశాల జేబులపై కూడా దాని ప్రభావం పడుతుంది. హోర్ముజ్‌లో ఉద్రిక్తతలు మరింత పెరిగితే మొదట పెరగేది ముడి చమురు ధరలు… ఆ తర్వాత పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్… చివరకు ప్రతి ఇంటి ఖర్చు. అందుకే అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కేవలం రెండు దేశాల సమస్య కాదు… ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సవాల్ అని నిపుణులు చెబుతున్నారు.