192k-votes-deleted :SIR సర్జికల్ స్ట్ర‌యిక్..Andhra Prabha Top Story

192k-votes-deleted :SIR సర్జికల్ స్ట్ర‌యిక్..Andhra Prabha Top Story

  • 1,91,996 ఓట్లు క‌స‌క్
  • పల్నాడు నేత‌లో ఆందోళ‌న‌
  • స్థానిక స‌మీక‌ర‌ణ‌కు తీర‌ని దెబ్బ‌
  • అన్ని పార్లీల్లోనూ క‌ల‌వ‌రం

( ప‌ల్నాడుబ్యూరో . ఆంధ్ర‌ప్ర‌భ‌) :
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక్క ఓటు కూడా గెలుపోటములను శాసిస్తుంది. అలాంటి ఓటు హక్కు విషయంలో ఎన్నికల సంఘం చేపట్టిన ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ ప్రక్రియ ఇప్పుడు పల్నాడు జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. జిల్లావ్యాప్తంగా ఏకంగా 1,91,996 ఓట్లను తొలగించడం ద్వారా, దశాబ్దాలుగా పాతుకుపోయిన ‘డబుల్ ఓట్ల’ డొంకను అధికారులు కదిలించారు. ఈ భారీ ఓట్ల కోత రాబోయే ఎన్నికల్లో రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చబోతోందనే చర్చ ఇప్పుడు జిల్లావ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
ఒక్క ఓటుతో గెలిచిన‌వారు, ఓడిన వారు ఉన్నారు. ఇంత‌టి ప్ర‌ధాన్యం గ‌ల ఓటు విష‌యంలో రాజ‌కీయ పార్టీలు అప్ర‌మ‌త్తంగా ఉంటాయి. ప్ర‌స్తుతం ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) ప్రక్రియ ద్వారా మొత్తం 1,91,996 ఓట్లను అధికారులు జాబితా నుంచి తొలగించారు. దీని ప్ర‌భావం భ‌విష్య‌త్తులో జ‌రిగే ప్ర‌తి ఎన్నిక‌పై ఉంటుంద‌న్న‌ది నిర్వివాదాంశం. అయితే రాజ‌కీయ పార్టీ పైకి మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తున్నా రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారిపోతాయ‌ని ఆందోళ‌న చెందుతున్నారు. ముఖ్యంగా స్వల్ప మెజారిటీతో గెలుపోటములు నిర్ణయమయ్యే నియోజకవర్గాల్లో, ఈ స్థాయి ఓట్ల కోత రాబోయే ఎన్నికల్లో కీలకంగా మారనుంది. అధికార యంత్రాంగం చేపట్టిన ఈ ప్రక్రియ రాజకీయ ముఖచిత్రాన్ని ఎలా మార్చబోతుందోనని ఆయా పార్టీల నాయకులు చర్చించుకుంటున్నారు.

డ‌192k-votes-deleted : డ‌బుల్ ఎంట్రీకి చెక్‌…

గ‌తంలో స్థానిక సంస్థ‌లు , అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఇలా ఏ ఎన్నిక‌లు వ‌చ్చినా వేరే ప్రాంతాల్లో ఉన్న వారి ఓట్లు కోసం పెద్ద క‌స‌ర‌త్తు జ‌రిగిదే. వేరే ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నా… ఆడ‌బిడ్డ‌లైతే వివాహాం అయి వేరే ప్రాంతాల‌కు వెళ్లినా.. ఉపాధి కోసం ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లినా వారిని ఎన్నిక‌ల స‌మ‌యానికి పిలిపించి త‌మ‌కు అనుకూల‌మైన పార్టీకి ఓట్లు వేసేలా వ్యూహం ర‌చించేవారు. వీరికి రెండు ప్రాంతాల్లో కూడా ఓట్లు ఉండ‌టం ప‌రిపాటి. రాజ‌కీయ పార్టీల నాయ‌కులు ఓట‌ర్ లిస్టు ద‌గ్గ‌ర పెట్టుకొని ఇలాంటి ఓట్లు ఎవ‌రి ఇంట్లో ఎన్ని ఉన్నాయో అని గుర్తించి వారిని ర‌ప్పించి ఓట్లు వేయించే వారు. అయితే ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) ప్రక్రియ ద్వారా ఇటువంటి ఓట్ల‌కు చెక్ ప‌డింది. ప‌ల్నాడు జిల్లాలో ఈ ప్ర‌క్రియ ద్వారా శాశ్వతంగా వలస వెళ్లిన వారు 59,494 మంది, డబుల్‌ ఎంట్రీ ఓటర్లు 24,378 మంది ఉంటే వారిని తొల‌గించారు.

192k-votes-deleted : వ‌చ్చే ఎన్నికల్లో ఎదురు దెబ్బ‌… ?

ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటర్ల జాబితా అనేది వెన్నెముక వంటిది. అయితే, పల్నాడు జిల్లాలో తాజాగా జరిగిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఎస్‌ఆర్) ప్రక్రియ రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. సుమారు 1,91,996 ఓట్ల తొలగింపు అనేది కేవలం గణాంకాలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఇది రాబోయే ఎన్నికల ఫలితాలను మలుపు తిప్పగల ఒక కీలక పరిణామం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పల్నాడు జిల్లాలోని పలు నియోజకవర్గాల చరిత్రను పరిశీలిస్తే, గత ఎన్నికల్లో గెలుపోటములు అత్యంత స్వల్ప మెజారిటీలతోనే నిర్ణయమయ్యాయి. కొన్ని చోట్ల కొన్ని వందల ఓట్ల తేడాతోనే అధికారం చేతులు మారింది. ఇటువంటి సున్నితమైన రాజకీయ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, ఒకే నియోజకవర్గంలో 20 వేల నుంచి 34 వేల వరకు ఓట్లు తగ్గిపోవడం అనేది అసాధారణమైన విషయంగా పరిగణించబడుతోంది. ఏ నియోజకవర్గంలోనైతే గతంలో అతి తక్కువ మెజారిటీతో అభ్యర్థులు గెలిచారో, అక్కడ ఇప్పుడు జరిగిన ఓట్ల కోత వారి వ్యూహాలను దెబ్బతీసే అవకాశం ఉంది.మరణాలు లేదా చిరునామా మార్పుల వల్ల జరిగిన తొలగింపుల కంటే, నమోదులో జరిగిన సాంకేతిక పొరపాట్ల వల్ల అర్హులైన ఓట్లు తొలగిపోయి ఉంటే, అది ఏ పార్టీకి నష్టం చేకూరుస్తుందనే అంశంపై ఇప్పటికే ఆయా పార్టీలు అంతర్గత విశ్లేషణలు మొదలుపెట్టాయి. జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలు రాజకీయంగా అత్యంత సున్నితమైనవిగా గుర్తింపు పొందాయి. అక్కడ ప్రతి ఓటూ నిర్ణయాత్మకం. అటువంటి చోట భారీ సంఖ్యలో ఓట్లు గల్లంతవ్వడం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కొత్తగా ‘ఓట్ల యుద్ధానికి’ తెరలేపింది.క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితాలోని ఈ మార్పులు తమ ఓటు బ్యాంక్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని ఆందోళన చెందుతున్నాయి. ఈ తొలగింపులు రాబోయే ఎన్నికల్లో ‘గేమ్ ఛేంజర్’గా మారుతాయా? లేక పార్టీలు తమ పాత ఓటు బ్యాంకును తిరిగి ఎలా పుంజుకునేలా చేస్తాయి? అనే అంశాలు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరమైన ప్రశ్నలుగా మారాయి. అధికార యంత్రాంగం నిబంధనల ప్రకారమే ఓట్లు తొలగించామని చెబుతున్నప్పటికీ ఈ వ్య‌వ‌హారం పార్టీల‌కు మింగుడు ప‌డ‌టం లేదు.

192k-votes-deleted : న‌ర‌స‌రావుపేటలో భారీ కోత‌

ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) ప్రక్రియ ద్వారా అసలు సిసలైన ఓటర్ల లెక్క తేలింది. జిల్లాలో ఏ స్థాయిలో బోగస్, డబుల్‌ ఎంట్రీలు, ఆచూకీ లేని ఓట్లు ఉన్నాయో స్పష్టమైంది. సర్‌ ప్రక్రియకు ముందు జిల్లాలో మొత్తం 17,41,798 మంది ఓటర్లు ఉండగా… తాజాగా ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం 15,49,802 మంది ఉన్నారు. దీని ప్రకారం మొత్తం 1,91,996 ఓట్లను అధికారులు జాబితా నుంచి తొలగించారు. వీటిలో ఆచూకీ తెలియని ఓటర్లు 46,157 మంది, శాశ్వతంగా వలస వెళ్లిన వారు 59,494 మంది, డబుల్‌ ఎంట్రీ ఓటర్లు 24,378 మంది ఉన్నారు. జిల్లాలో అత్యధికంగా నరసరావుపేట నియోజకవర్గ పరిధిలో 34,875, ఆ తర్వాత గురజాలలో 33,837 ఓట్లు తొలగించారు. నరసరావుపేట పట్టణం, రొంపిచర్ల మండలాల్లో డబుల్‌ ఎంట్రీలు, స్థానికంగా నివాసం లేనివారు, మృతుల ఓట్లు అత్యధిక సంఖ్యలో ఉండటం గమనార్హం. గురజాలలోనూ ఇదే పరిస్థితి ఉంది.

192k-votes-deleted : ఇక అతివ‌లే ఆధారం

పల్నాడు జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య వివరాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు వెల్లడవుతున్నాయి. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ మ‌హిళా ఓట‌ర్ల సంఖ్యే అధికంగా ఉంది. పెదకూరపాడు నియోజకవర్గంలో 2,11,879 మంది ఓటర్లు ఉండగా, వారిలో 1,03,743 మంది పురుషులు, 1,08,124 మంది మహిళలు మరియు 12 మంది ఇతరులు ఉన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో మొత్తం 1,99,590 మంది ఓటర్లు ఉండగా, వారిలో 95,984 మంది పురుషులు, 1,03,573 మంది మహిళలు, 33 మంది ఇతరులు ఉన్నారు. నరసరావుపేట నియోజకవర్గంలో 1,96,881 మంది ఓటర్లు ఉండగా, వారిలో 95,799 మంది పురుషులు, 1,01,062 మంది మహిళలు, 20 మంది ఇతరులు ఉన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో మొత్తం 2,23,828 మంది ఓటర్లు ఉండగా, వారిలో పురుషులు 1,09,570 మంది, మహిళలు 1,14,248 మంది మరియు 10 మంది ఇతరులు ఉన్నారు. వినుకొండ నియోజకవర్గంలో మొత్తం 2,41,566 మంది ఓటర్లు నమోదయ్యారు; వీరిలో 1,20,176 మంది పురుషులు, 1,21,373 మంది మహిళలు, 17 మంది ఇతరులు ఉన్నారు. అలాగే గురజాల నియోజకవర్గంలో 2,41,254 మంది ఓటర్లు ఉండగా, వారిలో 1,17,693 మంది పురుషులు, 1,23,520 మంది మహిళలు, 41 మంది ఇతరులు ఉన్నారు. మాచర్ల నియోజకవర్గంలో 2,34,804 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 1,15,374 మంది పురుషులు, 1,19,412 మంది మహిళలు మరియు 18 మంది ఇతరులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వీటితో పాటు, జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను కలిపి మొత్తం 1,195 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

192k-votes-deleted : బోగ‌స్ దారికి అడ్డుక‌ట్ట

అధికార యంత్రాంగం నిబంధనల ప్రకారమే ఈ ప్రక్రియను చేపట్టినట్లు చెబుతున్నప్పటికీ, రాజకీయ పార్టీలు మాత్రం దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. ఒకప్పుడు ఓటర్ల లిస్టును దగ్గర పెట్టుకుని, ఇతర ప్రాంతాల్లో ఉన్న వారిని సైతం రప్పించి ఓట్లు వేయించుకున్న పార్టీలకు, ఇప్పుడు ఆ ‘బోగస్’ ఓట్ల దారి మూసుకుపోవడం పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పాలి. ఏ నియోజకవర్గంలోనైతే గతంలో అతి తక్కువ మెజారిటీతో విజయం దక్కిందో, అక్కడ ఇప్పుడు జరిగిన భారీ ఓట్ల కోత అభ్యర్థుల వ్యూహాలను తలకిందులు చేసే అవకాశం ఉంది. ఓట్ల తొలగింపుతో రాజకీయ పార్టీలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా, అంతర్గతంగా మాత్రం తమ ఓటు బ్యాంకుకు ఏ మేరకు గండి పడిందోనని ఆందోళన చెందుతున్నాయి. ప్రజాస్వామ్య స్ఫూర్తితో జరిగిన ఈ ఓటర్ల శుద్ధీకరణ.. రాబోయే ఎన్నికల్లో ‘గేమ్ ఛేంజర్’గా మారుతుందా? లేక పార్టీలు మరేదైనా కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తాయా? అనేది వేచి చూడాల్సిందే.