కుటుంబ విషయాలపై తరచూ గొడవలు….
ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో…
భూత్పూర్, ఆంధ్రప్రభ : భూత్పూర్ మండలం కొత్త మొల్గర గ్రామంలో కుటుంబ కలహాలు ఓ మహిళ ప్రాణాలను బలిగొన్నాయి. శనివారం ఉదయం జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపడంతో పాటు గ్రామస్థులను కలిచివేసింది. వివరాల్లోకి వెళ్తే స్థానికుల కథనం ప్రకారం….గ్రామానికి చెందిన కంపిల్ల వెంకటయ్య, ఆయన భార్య అలివేలు (50) మధ్య కొంతకాలంగా కుటుంబ విషయాలపై తరచూ గొడవలు జరుగుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. శనివారం ఉదయం మరోసారి ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ఆగ్రహానికి లోనైన వెంకటయ్య ఇంట్లో ఉన్న గొడ్డలిని తీసుకుని భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో అలివేలు తీవ్రంగాగాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఘటన గురించి సమాచారం అందుకున్న భూత్పూర్ సిఐరామకృష్ణ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్నిపరిశీలించారు.అనంతరం పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మృతురాలి కుమార్తె మంజుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లిదండ్రుల మధ్య తరచూ జరుగుతున్న కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమయ్యాయని ఆమె తెలిపినట్లు సమాచారం.
ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. గ్రామంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
