CM Chandrababu | భోగాపురం ఉత్తరాంధ్రకు మణిహారం..

  • ఉత్తరాంధ్ర దశ మారుస్తుంది భోగాపురం
  • ఉత్తరాంధ్రలో రూ.6.13 లక్షల కోట్ల పెట్టుబడులు


CM Chandrababu | విజయనగరం, ఆంధ్రప్రభ : భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి మణిహారంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విమానాశ్రయ ప్రారంభోత్సవ సభలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ప్రసంగించిన ఆయన, ఈ ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్ర భవిష్యత్తును పూర్తిగా మార్చబోతుందని చెప్పారు.

భోగాపురం విమానాశ్రయానికి భూములిచ్చిన రైతులే ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. రెండేళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ప్రధాని మోదీ నాయకత్వంలో తాను, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు.

శంషాబాద్ విమానాశ్రయం తెలంగాణ దశ, దిశను మార్చినట్లే భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు కొత్త అవకాశాలను తీసుకురానుందని చెప్పారు. ఒకప్పుడు “ఎర్రబస్సు కూడా రాదన్నారు.. కానీ ఇప్పుడు ఎయిర్‌బస్ వచ్చింది” అంటూ విమర్శకులపై చురకలు అంటించారు.

అల్లూరి సీతారామరాజు పేరు తలుచుకుంటే గుండె ఉప్పొంగుతుందని, ఆయన పేరును విమానాశ్రయానికి పెట్టడం గర్వకారణమన్నారు. ఉత్తరాంధ్ర వాసి అయిన జీఎంఆర్ సంస్థ ఈ విమానాశ్రయాన్ని నిర్మించడం విశేషమని చెప్పారు. అలాగే విమానాశ్రయ నిర్మాణానికి తొలి అడుగులు వేయించిన అశోక్ గజపతిరాజు, ప్రస్తుత కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా ఉత్తరాంధ్ర వారేనని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ, విశాఖ రైల్వే జోన్, పోలవరం, అమరావతికి నిధులు కేటాయించడంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారని చంద్రబాబు పేర్కొన్నారు.