చిన్నసూరారంలో మంత్రి కోమటిరెడ్డి పర్యటన
రూ.1.35 కోట్ల సీసీ రోడ్డు ప్రారంభం
మహిళా సంఘాల అభివృద్ధికి మంత్రి ఆదేశాలు
పావురాలగూడెంకు చౌకధర దుకాణం
నల్గొండ, ఆంధ్రప్రభ: నల్గొండ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం ప్రారంభించారు. మండలంలోని చిన్నసూరారం హామ్లెట్ గ్రామం పావురాలగూడెంలో రూ.1.35 కోట్ల వ్యయంతో నిర్మించిన పీడబ్ల్యూడీ సీసీ రోడ్డును మంత్రి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావాలంటే ఉపాధి అవకాశాలు పెరగాలని పేర్కొన్న మంత్రి, చిన్నసూరారంలో మహిళా సంఘాల కోసం వేర్‌హౌస్ లేదా రైస్‌మిల్ ఏర్పాటు చేసేందుకు 5 నుంచి 10 ఎకరాల స్థలాన్ని గుర్తించాలని అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారికి సూచించారు. పావురాలగూడెంలో చౌకధర దుకాణం లేక ప్రజలు చిన్నసూరారం వరకు వెళ్లి రేషన్ తీసుకురావాల్సి వస్తోందని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకురాగా, వెంటనే గ్రామంలో చౌకధర దుకాణాన్ని మంజూరు చేసి డీలర్‌ను నియమించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, ఆర్డీఓ వై. అశోక్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ పి. మోహన్, పంచాయతీరాజ్ ఈఈ గిరిధర్, మాజీ జెడ్పీటీసీ లక్ష్మయ్య, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు ధనలక్ష్మి, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
