అధైర్యపడకండి
అండగా ఉంటాం : మంత్రి సీతక్క
ములుగు జిల్లా, మంగపేట, ఆంధ్రప్రభ : శనివారం రాష్ట పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటిడిఏ పిఓ లెనిన్ వస్సల్ టోప్పో లతో కలిసి మంగపేట లో గోదావరి వరద ప్రవాహాన్ని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం వరద ముంపు ప్రాంతాల బాధితులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా మంగపేట గోదావరి కరకట్ట నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, బ్యాక్‌వాటర్ ప్రభావంతో ముంపునకు గురయ్యే ప్రాంతాలకు చెందిన 28 కుటుంబాల 112 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్నందున, నది పరివాహక ప్రాంతాల్లోకి వరద నీరు చేరే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయక చర్యలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వరద బాధితులకు ఆహారం, తాగునీరు, వైద్య సేవలు, పారిశుద్ధ్య సౌకర్యాలు సహా అన్ని మౌలిక వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాధితులను పరామర్శించిన మంత్రి, వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ముంపు బాధితులకు శాశ్వత ప్రాతిపదికన ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని హామీ ఇచ్చారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.cఈ కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి,ఆర్డీవో కృష్ణవేణి , డిపిఓ కొండా వెంకయ్య, తహసిల్దార్ తోట రవీందర్, ఎంపీడీవో బద్రు నాయక్, పంచాయతీ కార్యదర్శి సురేష్,స్థానిక నాయకులు , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
