ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక భారం
- ఏకో సెన్సిటీవ్ జోన్ తో అడ్డంకులు
- సుప్రీంకోర్టు నిబంధనలతో ఇసుకకు పెనుభారం
- పట్టించుకోని మైనింగ్ శాఖ
- అటవీ శాఖ పైనే అధిక భారం
జన్నారం, ఆంధ్రప్రభ: గోదావరి నది పక్కనే ఉన్నప్పటికీ స్థానిక ప్రజలకు ఇసుక అందని పరిస్థితి నెలకొంది. కవ్వాల టైగర్ రిజర్వ్ పరిధిలో అమలవుతున్న ఎకో సెన్సిటివ్ జోన్ నిబంధనల కారణంగా గోదావరి, వాగుల నుంచి ఇసుకను స్థానిక అవసరాలకు కూడా వినియోగించకుండా ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్న పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు టైగర్ రిజర్వ్‌ల చుట్టూ 10 కిలోమీటర్ల వరకు ఎకో సెన్సిటివ్ జోన్‌ను అమలు చేస్తున్నారు. ఈ నిబంధనల ప్రకారం కవ్వాల టైగర్ రిజర్వ్‌కు ఆనుకుని ఉన్న గోదావరి నది, వాగుల నుంచి ఇసుక తరలింపును పూర్తిగా నిషేధించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 2,015.44 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతాన్ని కేంద్రంగా తీసుకుని 2012 ఏప్రిల్‌లో కవ్వాల టైగర్ రిజర్వ్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 892.44 చదరపు కిలోమీటర్లను కోర్ ఏరియాగా, 1,123 చదరపు కిలోమీటర్లను బఫర్ ఏరియాగా ప్రభుత్వం ప్రకటించింది. జన్నారం అటవీ డివిజన్ పరిధిలో కోర్ ఏరియా ఉండగా, దండేపల్లి, ఖానాపూర్, కడెం, దస్తూరాబాద్, ఉట్నూర్, లింగాపూర్ తదితర మండలాలు బఫర్ జోన్లో ఉన్నాయి.

ఈ నేపథ్యంలో జన్నారం అటవీ డివిజన్ పరిధిలోని 10 కిలోమీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్లో ఇసుక తవ్వకం, రవాణాపై పూర్తి నిషేధం అమల్లో ఉంది. మైనింగ్, రెవెన్యూ, పోలీసు శాఖలు ఉన్నప్పటికీ ఈ నిబంధనల అమలు బాధ్యత ప్రధానంగా అటవీ శాఖపైనే పడింది. గత ఆరు నెలలుగా అటవీ అధికారులు కఠినంగా నిబంధనలు అమలు చేస్తూ, ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లు, టిప్పర్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారు.
దీంతో స్థానిక అవసరాల కోసం ఇసుక తీసుకెళ్తున్న ప్రజలు, ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టిన నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాక్టర్ యజమానులు పలుమార్లు ఆందోళనలు చేపట్టగా, ప్రజాప్రతినిధులు కూడా ఈ సమస్యపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఫలితంగా స్థానిక ప్రజల్లో అటవీ శాఖపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఒక కిలోమీటరుకు తగ్గించాలని ప్రతిపాదనలు
ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిని 10 కిలోమీటర్ల నుంచి ఒక కిలోమీటరుకు తగ్గించాలని అటవీ శాఖ ప్రతిపాదనలు పంపింది. 2025 ఏప్రిల్‌లో అప్పటి జిల్లా అటవీ శాఖ అధికారి, ఇన్చార్జి ఎఫ్డీఓ శివ ఆశిష్ సింగ్ ప్రతిపాదనలు పంపగా, 2026 ఏప్రిల్‌లో కవ్వాల టైగర్ రిజర్వ్ ఎఫ్డీపీటీ, మంచిర్యాల సీఎఫ్ శాంతారాం కూడా రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణాధికారి (పీసీసీఎఫ్)కు నివేదిక పంపారు.
తదనంతరం 2026 మే 15న రాష్ట్ర పీసీసీఎఫ్ ఈ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వాటిని కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సి ఉంది. కేంద్రం అనుమతి లభిస్తే ఎకో సెన్సిటివ్ జోన్ పరిధి ఒక కిలోమీటరుకు తగ్గే అవకాశం ఉండటంతో, స్థానిక ప్రజలు గోదావరి, వాగుల ఇసుకను తమ అవసరాలకు వినియోగించుకునే వీలు కలుగుతుంది. ఈ ప్రక్రియను వేగవంతం చేసి కేంద్ర అనుమతులు త్వరగా తీసుకురావాలని స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.

“ఎకో సెన్సిటివ్ జోన్ తగ్గింపునకు ప్రతిపాదనలు పంపాం”
– ఎం. రామ్మోహన్, జన్నారం ఎఫ్డీఓ
ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిని 10 కిలోమీటర్ల నుంచి ఒక కిలోమీటరుకు తగ్గించాలని ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్లు జన్నారం ఎఫ్డీఓ ఎం. రామ్మోహన్ తెలిపారు. స్థానిక ప్రజలు, ట్రాక్టర్ యజమానులు, ప్రజాప్రతినిధుల వినతుల మేరకు ఈ ప్రతిపాదనలు పంపామని, ప్రస్తుతం అవి రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
