నిరుద్యోగ యువతకు శుభవార్త..
- ఆగస్టు 3న తిరుపతిలో భారీ జాబ్ మేళా
- పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్
తిరుపతి కలెక్టరేట్, ఆంధ్రప్రభ : జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆగస్టు 3న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళా పోస్టర్ను శుక్రవారం కలెక్టర్ వెంకటేశ్వర్ కలెక్టరేట్లో ఆవిష్కరించారు. జాబ్ మేళా ఆగస్టు 3వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు తిరుపతి బాలాజీ కాలనీలోని ఎస్వీసీసీ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. శ్రీ సిటీ, మేనకూరు ఎస్ఈజెడ్, ఈఎంసీ క్లస్టర్, తిరుపతి, బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు చెందిన ప్రముఖ బహుళజాతి సంస్థలు జాబ్ మేళాలో పాల్గొని వివిధ విభాగాల్లో అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, బీటెక్, పీజీ ఉత్తీర్ణులైన 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతీ యువకులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. ఎంపికైన అభ్యర్థులకు అర్హతలను బట్టి నెలకు రూ.18 వేల నుంచి రూ.30 వేల వరకు జీతం అందించనున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు https://naipunyam.ap.gov.in/ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 7013509543, 9988853335 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
