ఆంధ్రప్రభ ఎఫెక్ట్.. ప్రజా సమస్యకు పరిష్కారం..!!

చిట్టినగర్, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 48వ డివిజన్‌లో శ్రీ కామాక్షి విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న రాయప్పరాజు వీధిలో కృంగిపోయిన సిమెంట్ రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. ఈ సమస్యపై ఆంధ్రప్రభలో గురువారం ప్రచురితమైన కథనానికి స్పందించిన భవన యజమాని వెంటనే చర్యలు తీసుకున్నారు.

వీధి ప్రారంభంలో నిర్మాణంలో ఉన్న భవనానికి తీసుకొచ్చిన ఇటుకల లోడ్ కారణంగా సిమెంట్ రోడ్డు దెబ్బతిన్నట్లు గుర్తించి, శుక్రవారం కృంగిన ప్రాంతాన్ని పూర్తిగా తొలగించి తిరిగి సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు.

దీంతో చాలా రోజులుగా ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం లభించిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చి పరిష్కారానికి దోహదపడిన ఆంధ్రప్రభ దినపత్రికకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.