విద్యార్థినుల భద్రతే లక్ష్యం..

ఆకతాయిలపై కఠిన చర్యలు : ఏలూరు పోలీసులు


ఏలూరు, జులై 31 (ఆంధ్రప్రభ): విద్యార్థినులు, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఏలూరు పోలీసులు శుక్రవారం నగరంలోని జేవియర్ నగర్ బీసీ వెల్ఫేర్ హాస్టల్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎం.సుబ్బారావు ఆధ్వర్యంలో, ఏలూరు 3 టౌన్ ఇన్‌స్పెక్టర్ కోటేశ్వరరావు, టౌన్ ‘శక్తి టీం’ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈసందర్భంగా ఇన్‌స్పెక్టర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ… కాలేజీలు, పాఠశాలలు ముగిసే సమయాల్లో విద్యార్థినులు బస్సులు ఎక్కే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మహిళలను వేధించే ఆకతాయిలను గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించడంతో పాటు వారి తల్లిదండ్రులకు సమాచారం అందజేస్తామని చెప్పారు.

విద్యాసంస్థల పరిసరాలు, బహిరంగ ప్రదేశాల్లో మహిళలను వేధించే వారిపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థినులు, మహిళలు ఎలాంటి వేధింపులు ఎదురైనా భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని, వారి భద్రత కోసం ఏలూరు పోలీసులు 24 గంటలూ అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా అత్యవసర పరిస్థితుల్లో 112 పోలీసు సహాయం, 181 మహిళల హెల్ప్‌లైన్, 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ హాస్టల్ అధికారులు, విద్యార్థినులు, శక్తి టీం సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.