డిగ్రీ కళాశాలకు 5 ఎకరాల భూమి

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు ఎమ్మెల్యే కడియం శ్రీహరి కృతజ్ఞతలు

చిలుపూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి ఐదు ఎకరాల భూమిని కేటాయించినట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ శుక్రవారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో సంబంధిత కేటాయింపు పత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆవరణలో డిగ్రీ కళాశాల నిర్మాణం కోసం ఈ భూమిని కేటాయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి మార్గం సుగమం చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని శ్రీహరి అన్నారు. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు గురుకుల పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల, తెలంగాణ పబ్లిక్ స్కూల్‌తో పాటు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా త్వరలోనే స్వంత భవనంలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంతో పాటు, ఈ ప్రాంతాన్ని విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు.