మొక్కలు నాటి పచ్చని భవిష్యత్తు నిర్మిద్దాం

వనమహోత్సవంలో సర్పంచ్ ఆల శ్రీకాంత్ రెడ్డి

భూత్పూర్, ఆంధ్రప్రభ : అన్నాసాగర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. గ్రామ సర్పంచ్ ఆల శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో అరుదైన కల్పవృక్షం, సీతాఅశోక మొక్కలను నాటడంతో పాటు గ్రామ ప్రజలు, విద్యార్థులకు మొక్కలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ ఆల శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రకృతి సమతుల్యతను కాపాడాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. మనిషి చేస్తున్న తప్పిదాల వల్లే పర్యావరణం దెబ్బతింటోందని, వర్షాలు కూడా సకాలంలో కురవడం లేదని పేర్కొన్నారు. నాటిన మొక్కలను చెట్లుగా పెంచితేనే భావితరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించగలమని చెప్పారు.

ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి వెంకటేష్, ఉపసర్పంచ్ భాగ్యశ్రీ రమేష్, మాజీ ఎంపీటీసీ ఈట రజిత శేఖర్, వార్డు సభ్యులు కారూర్ శీను, కల్పన, అల్లిపురం నాగేందర్, శైలజ, చట్కరి నవీన్, యాదమ్మ, నాగమణి, పాఠశాల ఉపాధ్యాయుడు చక్రవర్తి గౌడ్, మహిళా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.