గోదావరి వరదలో చిక్కుకున్న కూలీలు.. వీరాపురంలో ఉత్కంఠ
చర్ల, ఆంధ్రప్రభ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం వీరాపురంలో గోదావరి వరద ఉద్ధృతి కారణంగా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం ఉదయం ఇసుక ర్యాంపులో పనులకు వెళ్లిన దాదాపు 50 మంది కూలీలు ఆకస్మికంగా పెరిగిన వరద ప్రవాహంతో గోదావరి మధ్యలో చిక్కుకుపోయారు. కూలీలతో పాటు లారీ డ్రైవర్లు, క్లీనర్లు కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న తహశీల్దార్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అధికారులు చర్యలు చేపట్టగా, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
