ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యం

పట్టణ మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక సదస్సులు

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ: పట్టణ స్థానిక సంస్థల పనితీరును మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో సీడీఎంఏ ఆధ్వర్యంలో ఎన్ఐయూఎం, ఈఎస్సీఐ సంయుక్తంగా నిర్వహిస్తున్న మూడో బ్యాచ్ శిక్షణ కార్యక్రమం హైదరాబాద్‌లో కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భీమ్‌గల్ మున్సిపాలిటీకి చెందిన అధికారులు కూడా పాల్గొంటున్నారు. శిక్షణలో భాగంగా నాయకత్వ వికాసం, మున్సిపల్ పాలన, పట్టణాభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమర్థ అమలు, టౌన్ ప్లానింగ్, పారిశుద్ధ్య నిర్వహణ, ఆర్థిక నిర్వహణ, డిజిటల్ సేవల వినియోగం తదితర అంశాలపై సీనియర్ అధికారులు, నిపుణులు సమగ్ర అవగాహన కల్పిస్తున్నారు.

పట్టణాభివృద్ధిలో నూతన విధానాలు, పారదర్శక పాలన, ప్రజా భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాల అమలు, పట్టణ మౌలిక సదుపాయాల కల్పనపై కూడా ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ ద్వారా అధికారులు తమ విధుల్లో మరింత నైపుణ్యాన్ని పెంపొందించుకుని పట్టణ ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించే సామర్థ్యాన్ని పెంచుకుంటారని నిర్వాహకులు తెలిపారు.