ఎగువ వర్షాలతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి

భూపాలపల్లి/మహాదేవపూర్, ఆంధ్రప్రభ: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం వద్ద గోదావరి ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. త్రివేణి సంగమం వద్ద వరద ప్రవాహం అధికమవుతుండగా, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఉదయం 8 గంటలకు విడుదల చేసిన వివరాల ప్రకారం కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం 11.290 మీటర్లకు చేరుకుంది. హెచ్చరిక స్థాయి 12.210 మీటర్లు, ప్రమాద స్థాయి 13.460 మీటర్లుగా ఉండగా, ప్రస్తుతం నీటిమట్టం హెచ్చరిక స్థాయికి 0.920 మీటర్లు, ప్రమాద స్థాయికి 2.170 మీటర్లు దిగువన ఉంది. అయినప్పటికీ ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

మరోవైపు మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజ్ వద్ద ఉదయం 6 గంటల నాటికి నీటిమట్టం 95.40 మీటర్లుగా నమోదైంది. బ్యారేజ్‌కు 6,79,910 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతుండగా, అదే స్థాయిలో 6,79,910 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉద్ధృతి కారణంగా బ్యారేజ్‌లోని 85 గేట్లను పూర్తిగా ఎత్తి నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం గోదావరి నది బ్యారేజ్ వద్ద ఫ్రీ ఫ్లోలో ప్రవహిస్తుండగా, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు, మత్స్యకారులు అవసరం లేని ప్రయాణాలు చేయవద్దని, గోదావరి తీరం, వాగులు, వంకలు, పుష్కర ఘాట్ల వద్దకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.