ఉపాధ్యాయురాలి డిప్యూటేషన్ రద్దు చేయాలి: బీఆర్‌ఎస్‌వీ డిమాండ్

ఊట్కూర్, ఆంధ్రప్రభ: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని శ్రీరాంనగర్ ఎంపీపీఎస్ పాఠశాల ఉపాధ్యాయురాలు అరుణను చిన్నపోర్ల పాఠశాలకు డిప్యూటేషన్‌పై పంపడాన్ని వెంటనే రద్దు చేసి, తిరిగి అదే పాఠశాలలో విధులు కేటాయించాలని బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు కోరం శివరాజ్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి నారాయణపేట డీఈవో కార్యాలయంలో సూపరింటెండెంట్ నరసింహారెడ్డి, సెక్టోరల్ అధికారి శ్రీనివాస్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కోరం శివరాజ్‌రెడ్డి మాట్లాడుతూ, శ్రీరాంనగర్ ఎంపీపీఎస్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉన్న ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు డిప్యూటేషన్‌పై పంపడం వల్ల విద్యార్థుల విద్యాభ్యాసం దెబ్బతింటుందని అన్నారు.

ఉపాధ్యాయురాలు అరుణను తిరిగి శ్రీరాంనగర్ ఎంపీపీఎస్ పాఠశాలలోనే విధులు నిర్వహించేలా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సమస్యను పరిష్కరించకపోతే బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు షేక్ సమీ, అరుణ్‌రెడ్డి, నరేష్, రాజు, విద్యార్థుల తల్లిదండ్రులు నర్సిములు, ఉమా, వర్ష, శోభ తదితరులు పాల్గొన్నారు.