Kesineni chinni | జాతీయ రహదారి విస్తరణకు వేగం పెంచిన కేంద్రం

  • విజయవాడ–మచిలీపట్నం 6 లేన్ల రోడ్డుకు డీపీఆర్ సిద్ధం
  • హైదరాబాద్–నందిగామ, సంగారెడ్డి–హైదరాబాద్ విభాగాలపై కూడా కసరత్తు
  • వ్యయం, నిర్మాణ గడువుపై డీపీఆర్ తర్వాతే తుది నిర్ణయం
  • ఎంపీ కేశినేని ప్రశ్నకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లిఖితపూర్వక సమాధానం

విజయవాడ, ఆంధ్రప్రభ: పూణే నుంచి మచిలీపట్నం వరకు విస్తరించిన జాతీయ రహదారి–65 (ఎన్‌హెచ్-65) అభివృద్ధి పనులపై కేంద్ర ప్రభుత్వం కీలక వివరాలను లోక్‌సభ వేదికగా వెల్లడించింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అడిగిన ప్రశ్నకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ జైరామ్ గడ్కరీ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల అభివృద్ధి నిరంతర ప్రక్రియగా కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ట్రాఫిక్ సాంద్రత, కనెక్టివిటీ అవసరాలు, వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్), సాధ్యత అధ్యయనాలు, పీఎం గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ఆధారంగా దశలవారీగా రహదారి ప్రాజెక్టులు చేపడుతున్నట్లు పేర్కొంది. సంగారెడ్డి–హైదరాబాద్, హైదరాబాద్–నందిగామ మధ్య ఎన్‌హెచ్-65ను ఆరు లేన్లుగా విస్తరించేందుకు డీపీఆర్ పనులు కొనసాగుతున్నాయని తెలిపింది. నందిగామ–విజయవాడ రహదారి అభివృద్ధి ఇప్పటికే పూర్తయిందని వెల్లడించింది.

విజయవాడ–మచిలీపట్నం మార్గాన్ని ఆరు లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ రహదారిగా అభివృద్ధి చేసేందుకు డీపీఆర్ సిద్ధం చేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది. పూణే–సోలాపూర్, సోలాపూర్–మహారాష్ట్ర–కర్ణాటక సరిహద్దు విభాగాల్లో కారిడార్ అభివృద్ధికి సంబంధించి డీపీఆర్‌ల కోసం బిడ్లు ఆహ్వానించినట్లు వెల్లడించింది. మహారాష్ట్ర–కర్ణాటక సరిహద్దు నుంచి సంగారెడ్డి వరకు ఆరు లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ హైవేగా ఈపీసీ విధానంలో పనులు కొనసాగుతున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం ప్రాజెక్టు వివిధ దశల్లో ఉండటంతో మొత్తం వ్యయం, నిధుల కేటాయింపు, పనుల పూర్తి గడువును ఇప్పుడే ప్రకటించడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. డీపీఆర్‌లు పూర్తైన అనంతరం సాంకేతిక పరిశీలనలు, ట్రాఫిక్ అవసరాలు, పరిపాలనా ఆమోదాల ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొంది. ఎన్‌హెచ్-65 కారిడార్‌ను అత్యాధునిక ప్రమాణాలతో అభివృద్ధి చేసి, విజయవాడ–మచిలీపట్నం ప్రాంతంతో పాటు మొత్తం మార్గంలో ప్రయాణ సౌకర్యాలు, రవాణా సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సమాధానంలో వెల్లడైంది.