Crime | 24 గంటల్లో కేసు ఛేదించిన కర్నూలు పోలీసులు

  • ఉచిత సిమ్ పేరుతో మహిళలకు టోకరా
  • బయోమెట్రిక్ వివరాలతో ప్రభుత్వ నిధుల కాజేత
  • రూ.5.85 లక్షల మోసం.. ఇద్దరు నిందితులు అరెస్ట్

కర్నూలు ప్రతినిధి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకాన్ని లక్ష్యంగా చేసుకుని అత్యంత పద్ధతిగా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల గుట్టును కర్నూలు వన్‌టౌన్ పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. ఉచిత ఎయిర్టెల్ సిమ్ కార్డులు ఇస్తామంటూ మహిళలను నమ్మించి వారి ఆధార్ వివరాలు, వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ సేకరించిన ఇద్దరు నిందితులు, బాధితులకు తెలియకుండా వారి పేర్లపై ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలు తెరిచి ప్రభుత్వం జమ చేసిన ‘తల్లికి వందనం’ పథకం నిధులను ఏటీఎంల ద్వారా కాజేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి రూ.5 లక్షల నగదు, 105 ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్/ఫినో ఏటీఎం కార్డులు, రెండు మొబైల్ ఫోన్లు, ఒక బయోమెట్రిక్ ఫింగర్‌ప్రింట్ పరికరం స్వాధీనం చేసుకున్నారు.

గడ్డా వీధికి చెందిన షేక్ ముంతాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ జి. మారుతి శంకర్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ పూల రామకృష్ణ, సైబర్ సెల్ ఇన్‌స్పెక్టర్ వై. ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం రంగంలోకి దిగి సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టింది.

పథకం ప్రకారమే మోసం..

దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, చిట్టారి వీధికి చెందిన నూకల ఉపేంద్ర, ఎయిర్టెల్ సంస్థ ఉద్యోగిగా పనిచేస్తున్న బోడేపాడు వీరారెడ్డి ముందస్తు ప్రణాళికతో ఈ మోసానికి పాల్పడ్డారు. గత ఏడాది డిసెంబర్ నుంచే కర్నూలు నగరంలోని గడ్డా వీధి, అలీషేర్‌బాగ్, చిట్టారి వీధి, ఖాదకురా తదితర ప్రాంతాల్లో ఉచిత ఎయిర్టెల్ సిమ్ కార్డులు ఇస్తామని ప్రచారం చేస్తూ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను గుర్తించారు.

సిమ్ యాక్టివేషన్ పేరుతో మహిళల నుంచి ఆధార్ కార్డులు, వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ వివరాలను సేకరించారు. ఆ వివరాలను ఉపయోగించి బాధితులకు తెలియకుండా వారి పేర్లతో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలు తెరిచి ఏటీఎం కార్డులు పొందారు. అనంతరం ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం కింద జమ చేసిన నగదును నగరంలోని వివిధ ఏటీఎం కేంద్రాల నుంచి విడతలవారీగా ఉపసంహరించి స్వాహా చేసినట్లు పోలీసులు గుర్తించారు.

రూ.5.85 లక్షల మోసం..

ఇప్పటివరకు గడ్డా వీధి, అలీషేర్‌బాగ్, చిట్టారి వీధి, ఖాదకురా ప్రాంతాలకు చెందిన 10 మంది మహిళలు ఇదే తరహా మోసానికి గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. వారి వాంగ్మూలాలు నమోదు చేసి బ్యాంకు లావాదేవీలను పరిశీలించగా, నిందితులు మొత్తం రూ.5.85 లక్షలు ఏటీఎంల ద్వారా ఉపసంహరించినట్లు వెల్లడైంది. మరికొంత మంది బాధితులు ఉండే అవకాశం ఉన్నందున దర్యాప్తును మరింత విస్తరించారు.

సీసీటీవీ ఫుటేజీలతో బట్టబయలు..

సైబర్ సెల్ బృందం సహకారంతో కర్నూలు నగరంలోని ఐదు ఏటీఎం కేంద్రాల సీసీటీవీ దృశ్యాలను సేకరించి పరిశీలించారు. ఆ ఫుటేజీల్లో నిందితుడు నూకల ఉపేంద్ర బాధితుల ఖాతాల నుంచి నగదు ఉపసంహరిస్తున్న దృశ్యాలు స్పష్టంగా లభించాయి. సాంకేతిక ఆధారాలు, డిజిటల్ లావాదేవీల వివరాలు, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.

స్వాధీనం చేసుకున్న వస్తువులు..

  • రూ.5,00,000 నగదు
  • 105 ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, ఫినో ఏటీఎం కార్డులు
  • రెండు మొబైల్ ఫోన్లు
  • ఒక బయోమెట్రిక్ ఫింగర్‌ప్రింట్ పరికరం

కర్నూలు నగరానికి చెందిన నూకల ఉపేంద్ర, బుధవారం పేటకు చెందిన బోడేపాడు వీరారెడ్డిని పోలీసులు అరెస్టు ఛేశారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఉచిత సిమ్ కార్డులు, ప్రభుత్వ పథకాలు లేదా బ్యాంకింగ్ సేవల పేరుతో ఎవరైనా ఆధార్ వివరాలు, వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ వంటి బయోమెట్రిక్ వివరాలు కోరితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వొద్దని పోలీసులు హెచ్చరించారు. అధికారిక సంస్థల ద్వారా మాత్రమే ఇలాంటి సేవలు పొందాలని, అనుమానాస్పద వ్యక్తులు ఎదురైతే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

దర్యాప్తు బృందానికి ఎస్పీ అభినందనలు

ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించిన వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ జి. మారుతి శంకర్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ పూల రామకృష్ణ, సైబర్ సెల్ ఇన్‌స్పెక్టర్ వై. ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎస్‌ఐ పి. హేమశ్యామ్ సుందర్‌తో పాటు హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు మరియు సైబర్ సెల్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.