Vijayawada |అమ్మ దర్శనానికి తరలివచ్చిన భక్తులు

  • శాకంభరీ ఉత్సవాలు, తాత్కాలికంగా అంతరాలయ దర్శనం రద్దు
  • అందరికి బంగారు వాకిలి ద్వారానే దర్శనం
  • ఆర్జిత సేవలకు విశేష స్పందన..
  • క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించిన ఈవో శీనా నాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ)

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి దర్శనానికి బుధవారం భక్తులు భారీగా తరలిరావడంతో ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలన్నీ భక్తజన సంద్రంగా మారాయి. ఒకవైపు మూడు రోజుల శాకంభరీ మహోత్సవాల సమాప్తి, మరోవైపు ఆషాఢ సారె ఉత్సవాలు, గురుపౌర్ణమి పర్వదినం ఒకేసారి రావడంతో తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు.

సామాన్య భక్తులకే పెద్దపీట..

అమ్మవారి దర్శనానికి గంట గంటకూ పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అంతరాలయ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేసి, బంగారు వాకిలి ద్వారానే అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. అలాగే విఐపీ, ప్రోటోకాల్, సిఫార్సు దర్శనాలకు తాత్కాలికంగా విరామం ఇచ్చి సాధారణ భక్తుల దర్శనానికి ప్రాధాన్యం కల్పించారు. అదనపు సిబ్బందిని నియమించి క్యూలైన్ల నిర్వహణను పటిష్ఠం చేయడంతో దర్శనాలు సజావుగా కొనసాగాయి.

ఆర్జిత సేవలకు విశేష స్పందన…

పౌర్ణమి సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ఆర్జిత సేవలకు విశేష స్పందన లభించింది. అమ్మవారికి ప్రత్యేక కుంకుమపూజ, చండీయాగం, ఖడ్గమాలార్చన తదితర విశేష పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందారు. శాకంభరీ అలంకారంలో దివ్యంగా దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు.

ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ…

దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్, ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ భక్తులకు కల్పిస్తున్న తాగునీరు, ప్రసాద పంపిణీ, క్యూలైన్ నిర్వహణ, భద్రత, వైద్యసేవలు తదితర ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. శాకంభరీ ఉత్సవాల ముగింపు, గురుపౌర్ణమి పుణ్యకాలం, ఆషాఢ సారె ఉత్సవాల విశిష్టతతో బుధవారం ఇంద్రకీలాద్రి భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. ‘జై కనకదుర్గమ్మ’ నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగగా, అమ్మవారి దర్శనం కోసం తరలివచ్చిన భక్తులు ఆధ్యాత్మిక అనుభూతిని ఆస్వాదించారు.