TG | నమ్మి ఓట్లేస్తే ప్రజలను నట్టేట ముంచారు … రేవంత్ పై కేసీఆర్ ధ్వజం
హైదరాబాద్ – ఆంధ్రప్రభ – కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లేసిన ప్రజలను రేవంత్ రెడ్డి నట్టేట ముంచారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు.. ఒక్క హామీ కూడా సరిగా అమలు చేయని అసమర్ధ ముఖ్యమంత్రిగా అపఖ్యాతిని ఏడాది కాలంలోనే మూటగట్టుకున్నారంటూ ఫైర్ అయ్యారు.. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌజ్ లో నేడు తనను కలసిన పార్టీ నేతలతో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలన పట్ల అన్ని వర్గాలలోనూ అసంతృప్తి ఉందన్నారు.
ఈ కాంగ్రెస్ సర్కార్ పై ఇక యుద్దం చేయాల్సిందేనని కేసీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.. రైతులను నిలువునా ముంచారు.. విద్యుత్ కోతలు వచ్చాయి, సాగునీటి ఇబ్బందుతు రైతులు ఎదుర్కొంటున్నారు..ఏ ఒక్క పథకం అమలు కావడం లేదు.. కెసిఆర్ కిట్ కు మంగళం.. తల్లి బిడ్డ పథకం అటకపైనా..ప్రశ్నిస్తే కేసులు అంటూ కెసిఆర్ అగ్రహం వ్యక్తం చేశారు.. ఇక రోడ్లపై సర్కార్ తో యుద్దం చేయాల్సిన తరుణం వచ్చేసిందంటూ పేర్కొన్నారు.
తాను కొడితే మామూలుగా కాదు.. గట్టిగా కొట్టడం తన అలవాటన్నారు . కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరన్నారు. గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నానన్నారు. తెలంగాణ శక్తి ఏంటో కాంగ్రెస్ వాళ్లకు చూపించి మెడలు వంచుదామన్నారు. కాంగ్రెస్ వాళ్లు ప్రజలు కొట్టేటట్టు ఉన్నారన్నారు. నిన్న కాంగ్రెస్ వాళ్లు పోలింగ్ పెడితే మనకే ఎక్కువ ఓటింగ్ వచ్చిందన్నారు. తాను చెప్పినా ప్రజలు వినలేదని.. అత్యాశకు పోయి కాంగ్రెస్‌కు ఓటేశారన్నారు. రైతుబంధుకు రాం రాం.. దళితబంధుకు జై భీం చెబుతారని తాను ఎన్నికల సమయంలోనే చెప్పానని గుర్తు చేశారు.
తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్‌కు ఓటు వేశారన్నారు. రాబోయే రోజుల్లో విజయం మనదేనన్నారు. మన విజయం తెలంగాణ ప్రజల విజయం కావాలన్నారు. ప్రత్యక్ష పోరాటాలకు బీఆర్‌ఎస్ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి నెలాఖరులో భారీ సభ పెడుతామని.. బీఆర్‌ఎస్ శ్రేణులు తరలిరావాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో భూముల ధరలు అమాంతం పడిపోయాయని.. రాష్ట్రంలో ప్రాజెక్టులు అక్కడే ఆగిపోయాయని మండిపడ్డారు. సంగమేశ్వర, బసవేశ్వర, కాళేశ్వరం ప్రాజెక్టులను ఎండబెడుతున్నారంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.