Bhuvaneshwari | ‘నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు’

  • మహిళలను కించపరిస్తే సహించను
  • మహిళల ఆత్మగౌరవంపై భువనేశ్వరి సందేశం
  • చౌకబారు రాజకీయాలకు భయపడను
  • కుటుంబ మహిళలను లక్ష్యంగా చేయొద్దు
  • కుప్పంలో భువనేశ్వరి భావోద్వేగ ప్రసంగం
  • ప్రజల ప్రేమే నా బలం


Bhuvaneshwari | చిత్తూరు, జులై 29 (ఆంధ్రప్రభ బ్యూరో) : నేను ఎలాంటి వ్యక్తినో నా భర్తకు తెలుసు… నన్ను ఆదరిస్తున్న ప్రజలకు తెలుసు. నన్ను నేను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఎవరైనా మాట్లాడితే మౌనంగా భరించడం కాదు. మహిళల గౌరవాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలు కుప్పం పర్యటనలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

మహిళలను కించపరిచే చౌకబారు రాజకీయాలకు తాను ఎప్పటికీ భయపడబోనని, ప్రజల ప్రేమాభిమానాలే తనకు అతిపెద్ద బలమని ఆమె స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా యామగానపల్లి ధర్మరాజుల స్వామి ఆలయంలో ద్రౌపది అమ్మవారిని దర్శించుకున్న అనంతరం భువనేశ్వరి మాట్లాడారు. ఇది ఎన్నికల ప్రసంగం కాదని, రాజకీయ విమర్శలు చేయడానికి తాను రాలేదని, మహిళల గౌరవం గురించి సమాజంలో చర్చ జరగాలనే ఉద్దేశంతోనే తన మనసులోని భావాలను పంచుకుంటున్నానని చెప్పారు.

మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టాన్ని ప్రస్తావిస్తూ, పాండవులను మానసికంగా దెబ్బతీయడానికి కౌరవులు ద్రౌపదిని అవమానించారని గుర్తు చేశారు. ప్రత్యర్థులను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేని వారు వారి కుటుంబ సభ్యులను, ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకోవడం ఆనాటి నుంచే కనిపిస్తోందని, అదే ధోరణి నేటి రాజకీయాల్లోనూ కొనసాగడం బాధాకరమన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరిగిన పరిణామాలను గుర్తు చేసుకుంటూ, తన భర్త చంద్రబాబు నాయుడిని రాజకీయంగా కుంగదీయాలనే ఉద్దేశంతో తన పేరును అనవసరంగా వివాదాల్లోకి లాగారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళ వ్యక్తిత్వాన్ని కించపరచడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.

రాజకీయ విభేదాలు వ్యక్తిగత దూషణలకు, కుటుంబ సభ్యుల అవమానానికి దారితీయకూడదని హితవు పలికారు. ఒక మహిళను అవమానించే హక్కు ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ కుటుంబంలోని మహిళలను లక్ష్యంగా చేసుకోవడం సరైన పద్ధతి కాదు. నేను ఎవరికీ నా గురించి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నా వ్యక్తిత్వం ఏమిటో నా కుటుంబానికి, ప్రజలకు తెలుసు అంటూ ఆమె స్పష్టం చేశారు. తన జీవితంలో ఎదురైన విమర్శలు, అవమానాలు తనను మరింత దృఢంగా మార్చాయని భువనేశ్వరి పేర్కొన్నారు.

మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడే విషయంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోనని చెప్పారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసే సంస్కృతికి సమాజమే గట్టి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మహాభారతంలో ద్రౌపదికి కష్టకాలంలో శ్రీకృష్ణుడు అండగా నిలిచినట్లే, తమ కుటుంబం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న సమయంలో కుప్పం ప్రజలు దేవుడి రూపంలో తమకు అండగా నిలిచారని ఆమె భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు.

గత 40 ఏళ్లుగా తమ కుటుంబాన్ని విశ్వసిస్తూ ఆదరిస్తున్న కుప్పం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు మాటల విషయంలో సంయమనం పాటించాలని, రాజకీయ సంస్కృతి పరస్పర గౌరవంపై నిలవాలని భువనేశ్వరి సూచించారు. మహిళల గౌరవాన్ని కాపాడటం ప్రతి కుటుంబం, ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొంటూ, మహిళలను అవమానించే సంస్కృతికి సమాజం ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా మహిళా సంఘాలు, ప్రజల్లోనూ విస్తృత చర్చకు దారితీశాయి.