ఇందిరా జయంతి కాలనీలో పారిశుద్ధ్య లోపం..

  • ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం శూన్యం

రాజుపాలెం, ఆంధ్రప్రభ: రాజుపాలెం మండల పరిధిలోని ఇందిరా జయంతి కాలనీలో ఏళ్ల తరబడి పారిశుద్ధ్యం పడకేసింది. ఈ ప్రాంతంలో సుమారుగా 150 కుటుంబాలు నివాసం ఉంటున్నారు. అయితే, గత పదేళ్లుగా ఈ కాలనీవాసులు పారిశుద్ద్య సమస్యతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై పలుమార్లు పంచాయితీ అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించాలని కోరినా.. పట్టించుకున్న నాధుడు లేడు.. దీంతో కాలనీ వాసులు డెంగ్యూ, మలేరియా, వంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజా ప్రతినిధులు మమ్మల్ని పట్టించుకొవడం లేదని.. కనీసం ప్రత్యేక అధికారుల పాలనలోనైనా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అనేక సార్లు కలసి మొరపెట్టుకున్న కనీసం కాలనీ వైపు కన్నెత్తైనా చూడడం లేదని మండిపడుతున్నారు. రానున్నవర్షాకాలంలో ఈ సమస్య మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంవని.. ఇప్పటికైనా జిల్లా ఉన్నత స్థాయి అధికారులు కలుగజేసుకుని ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

జిల్లా అధికారుల కే దిక్కులేదు… నేనెంత…!

ఈ సమస్యపై స్థానిక గ్రామపంచాయతీ అధికారి కాకుమాను సురేఖను “ఆంధ్రప్రభ” సంప్రదించగా.. ఎన్నో ఏళ్ల నుంచి నలుగుతున్న ఈ సమస్యను పరిష్కరించేందుకు జిల్లా అధికారులకే దిక్కులేదు… నేనెంత…! అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. నా పరిధిలో నేనేమీ చేయలేను.. పరిష్కారం అయ్యే నాటికి అవుతుంది… అందాక వేచి ఉండాల్సిందే.. అని ముక్కు సూటిగా సమాధానమిచ్చారు.

రోగాలతో అల్లాడిపోతున్నాం : గుంటక జయలక్ష్మి

ప్రతి ఏడాది వర్షాకాలం వచ్చిందంటే మా వెన్నులో వణుకు పుడుతుంది రోగాల బారిన పడి అల్లాడిపోతున్నాం. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. అధికారులను వేడుకుంటున్నా..

సమస్యను పరిష్కరించండి మహాప్రభో : ఉసర్తి ఏడుకొండలు

ఈ సమస్యను తక్షణమే పరిష్కరించండి మహాప్రభో… అంటూ కాలనీకి చెందిన ఏడుకొండలు వాపోతున్నారు. ఈ మురుగు నీటి పరిష్కారానికి ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న… ఏ ఒక్క అధికారి గాని, ప్రజాప్రతినిధి గాని స్పందించడం లేదని ఆవేదనను వెలిబుచ్చారు.