kesineni Chinni | దేశవ్యాప్తంగా 12 పైలట్ ప్రాజెక్టులకు ఆమోదం

  • లోక్‌సభలో ఎంపీ కేశినేని చిన్ని ప్రశ్నకు కేంద్రం సమాధానం
  • విశాఖ–బయ్యవరం మార్గంలో హైడ్రోజన్ ట్రక్ పైలట్ ప్రాజెక్టు
  • రూ.410.77 కోట్ల కేంద్ర సహాయం
  • హైడ్రోజన్ బస్సులు, ట్రక్కులతో స్వచ్ఛ ఇంధన రవాణాకు ప్రోత్సాహం
  • పనితీరు, భద్రతపై నిరంతర పర్యవేక్షణ

విజయవాడ, ఆంధ్రప్రభ: దేశంలో గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత రవాణా వ్యవస్థ అభివృద్ధి, స్వచ్ఛ ఇంధన వినియోగానికి కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోందని లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అడిగిన ప్రశ్నకు కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద యెస్సో నాయక్ ఈ వివరాలు వెల్లడించారు. జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ (ఎన్‌జీహెచ్‌ఎం) కింద దేశవ్యాప్తంగా 21 మార్గాల్లో 16 హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ స్టేషన్లతో 70 హైడ్రోజన్ ఆధారిత వాహనాల నిర్వహణకు 12 పైలట్ ప్రాజెక్టులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు.

వీటిలో 27 హైడ్రోజన్ బస్సులు, 43 హైడ్రోజన్ ట్రక్కులు ఉండగా, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ సాంకేతికతలతో ఇవి నడవనున్నాయి. ఈ పైలట్ ప్రాజెక్టుల అమలుకు కేంద్ర ప్రభుత్వం రూ.410.77 కోట్ల ఆర్థిక సహాయాన్ని ఆమోదించగా, ఇప్పటివరకు రూ.41.582 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. రెండో దశలో గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో మరిన్ని హైడ్రోజన్ బస్సులు, ట్రక్కులను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి విశాఖపట్నం–బయ్యవరం జాతీయ రహదారి–16 మార్గంలో హెచ్‌పీసీఎల్–వోల్వో కన్సార్టియం ఆధ్వర్యంలో 40 టన్నుల సామర్థ్యంతో హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ ట్రక్ పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో హైడ్రోజన్ ఆధారిత భారీ వాణిజ్య వాహనాల వినియోగానికి ఈ ప్రాజెక్టు నాంది పలుకుతుందని పేర్కొంది. గ్రీన్ హైడ్రోజన్ వాహనాల పనితీరు, ఇంధన సామర్థ్యం, భద్రతా ప్రమాణాలు, నిర్వహణ వ్యయం, వినియోగ అనుభవంపై సమగ్ర పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రి వివరించారు.

పైలట్ ప్రాజెక్టులను అమలు చేస్తున్న సంస్థలు సమర్పించే నివేదికల ఆధారంగా సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాలను అంచనా వేసి, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా గ్రీన్ హైడ్రోజన్ రవాణా విస్తరణకు అవసరమైన విధానాలను రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ సమాధానం గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత రవాణా వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను స్పష్టం చేస్తోందని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. కార్బన్ ఉద్గారాల తగ్గింపు, దిగుమతి ఇంధనాలపై ఆధారాన్ని తగ్గించడం, పర్యావరణహిత రవాణా వ్యవస్థ అభివృద్ధికి ఈ కార్యక్రమాలు కీలకంగా మారనున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.