నేర రహిత జిల్లానే లక్ష్యం

  • మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు
  • ఆరు నెలల్లో 254 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
  • కోర్టుకు.. రూ. 25.40 లక్షల జరిమానా
  • జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ: శ్రీ సత్యసాయి జిల్లాను నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళలు, చిన్నారులపై నేరాల అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ చేపట్టి కఠిన చర్యలు అమలు చేస్తున్నామని అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు.

గత ఆరు నెలలుగా చేపట్టిన ప్రత్యేక తనిఖీల ఫలితంగా రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో చర్యలు తీసుకున్నామని ఎస్పీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 364 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా, వాటిలో 254 కేసులను న్యాయస్థానంలో దాఖలు చేసినట్లు చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు ఇప్పటివరకు రూ.25.40 లక్షల జరిమానా వసూలు చేయడం జరిగిందన్నారు.

మోటారు వాహనాల చట్టం–1988లోని సెక్షన్–185 ప్రకారం 100 మిల్లీలీటర్ల రక్తంలో 30 మిల్లీగ్రాములకంటే ఎక్కువ ఆల్కహాల్ ఉన్నట్లు తేలితే ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.10 వేల వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని ప్రజలకు గుర్తుచేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిన నలుగురు నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు తెలిపారు. కదిరి రూరల్, కదిరి టౌన్, తనకల్లు, కొత్తచెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అలాగే పదేపదే నిబంధనలు ఉల్లంఘించిన ఎనిమిది మంది డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.

కదిరి అర్బన్‌లో ముగ్గురు, గొరంట్లలో ముగ్గురు, పెనుకొండలో ఒకరు, చిలమత్తూరులో ఒకరి లైసెన్సులు సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ చర్యలు మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 19(1)(d), 19(1)(f)తో పాటు సెంట్రల్ మోటారు వాహనాల నియమావళి–1989 రూల్–21 ప్రకారం చేపట్టినట్లు వివరించారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించేవారిపైనా ఉక్కుపాదం మోపుతున్నామని ఎస్పీ స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా 2,248 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేయగా, అందులో 1,115 కేసులను భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్–292 కింద కోర్టులో దాఖలు చేసినట్లు తెలిపారు. ఈ కేసుల ద్వారా ఇప్పటివరకు రూ.8,56,400 జరిమానా వసూలు చేసినట్లు వెల్లడించారు.

ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం మానుకోవాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల అమాయకుల ప్రాణాలు కోల్పోవడమే కాకుండా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. చట్టాలను గౌరవిస్తూ పోలీసు శాఖకు సహకరించాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై భవిష్యత్తులో మరింత కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.