నవజాత శిశువు మృతిపై సమగ్ర విచారణ
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం: కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు, ఆంధ్రప్రభ: ఇటీవల ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో జరిగిన నవజాత శిశువు మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హామీ ఇచ్చారు. బుధవారం రాష్ట్ర వైద్య విద్యా శాఖ డైరెక్టర్ డా. విష్ణువర్ధన్తో కలిసి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్, మృత శిశువు కుటుంబ సభ్యులను కలిసి వివరాలు తెలుసుకొని ఓదార్చారు.
వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ శిశువు మృతి చెందిందని బాధిత కుటుంబ సభ్యులు కలెక్టర్, డైరెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ కేసు షీట్లు, వైద్య రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఆసుపత్రిలో లోపాలపై ఆగ్రహం..
అనంతరం కలెక్టర్, డైరెక్టర్ ఆసుపత్రిలోని పలు వార్డులను ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలను పరిశీలించారు. పోస్ట్ ఆపరేటివ్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, బెడ్ షీట్లు మురికిగా, చిరిగిపోయి ఉండడంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓపీ, ఐపీ కౌంటర్ల వద్ద రోగులు ఎక్కువసేపు వేచి ఉండకుండా త్వరితగతిన నమోదు ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్యులు, వైద్య సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, హెచ్వోడీలు ఓపీ సమయాల్లో అందుబాటులో ఉండాలని సూచించారు.
సీఎస్ఆర్ నిధులతో ఆధునిక పరికరాలు
పోస్ట్ ఆపరేటివ్ వార్డులో అవసరమైన వైద్య పరికరాలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధుల ద్వారా సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజల సంతృప్తి స్థాయిని పెంచేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య విద్యా శాఖ డైరెక్టర్‌కు సూచించారు.
విచారణకు ప్రత్యేక అధికారి నియామకం
రాష్ట్ర వైద్య విద్యా శాఖ డైరెక్టర్ డా. విష్ణువర్ధన్ మాట్లాడుతూ నవజాత శిశువు మృతి ఘటనపై ఇప్పటికే విచారణ ప్రారంభించామని తెలిపారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రికి చెందిన డా. అనిల్‌ను విచారణ అధికారిగా నియమించామని, నివేదిక అందిన వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఏలూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఓపీ, ఐపీ నమోదు రెండింతలు పెరగడంతో పాటు శస్త్రచికిత్సలు మూడు నుంచి నాలుగు రెట్లు అధికమయ్యాయని, ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల విశ్వాసం పెరుగుతోందని పేర్కొన్నారు. శిశువు మృతి దురదృష్టకర సంఘటన అని, విచారణలో వైద్యుల నిర్లక్ష్యం తేలితే ఎలాంటి రాజీ లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలలో లోపాలు, వైద్యులు లేదా సిబ్బంది నిర్లక్ష్యానికి సంబంధించిన ఫిర్యాదులను 9849902961 నంబర్‌కు నేరుగా తెలియజేయవచ్చని డా. విష్ణువర్ధన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్యామల, డా. శశిధర్, డా. రామయ్యతో పాటు వివిధ విభాగాల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
