ఎమ్మెల్యే బడేటి క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్‌ కార్యక్రమం….

ఏలూరు బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రజల ఇబ్బందులను తెలుసుకుని, వాటికి పరిష్కారం చూపుతూ వారిలో భరోసా నింపే లక్ష్యంతోనే జవాబుదారీ పాలనకు శ్రీకారం చుట్టామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పునరుద్ఘాటించారు. ప్రజల సమస్యలను పరిష్కరించి, వారి ముఖాల్లో చిరునవ్వులు పూయించేందుకు ప్రజాదర్బార్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతోందని అన్నారు.

ఏలూరు పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను అర్జీలు, వినతుల రూపంలో ఎమ్మెల్యేకు అందజేశారు.

ప్రజాదర్బార్‌కు వచ్చిన ప్రతి ఒక్కరినీ ఎమ్మెల్యే ఆప్యాయంగా పలకరించి, వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు ఇంటి స్థలాలు కేటాయించాలని అర్జీలు అందించగా, మరికొందరు సామాజిక పింఛన్లు మంజూరు చేయాలని వినతులు సమర్పించారు. ఇంకొందరు తమ వ్యక్తిగత, స్థానిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

వాటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే బడేటి చంటి, అధైర్యపడాల్సిన అవసరం లేదని వారికి భరోసా కల్పించారు. కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార మార్గాలు చూపగా, మరికొన్నింటిపై సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వర చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పారదర్శక విధానాలతో జవాబుదారీ పాలన అందిస్తోందని చెప్పారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు.

ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటున్నానని తెలిపారు. అర్జీలు, వినతులు సమర్పించిన వారి వివరాలను నమోదు చేసి, సమస్యలు పరిష్కరించిన తర్వాత వారి ఆనందంలో భాగస్వామి కావడం ఎంతో ఆత్మసంతృప్తిని ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, టీడీపీ నగర అధ్యక్షుడు చోడే వెంకటరత్నం, సీనియర్ నాయకుడు బెల్లపుకొండ కిషోర్ పాల్గొన్నారు.