మూడు రోజుల పాటు వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి
వాజేడు, ఆంధ్రప్రభ: జిల్లాలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సూచించారు. బుధవారం వాజేడు మండలం చీకుపల్లి–పెద్దగొల్లగూడెం గ్రామాల మధ్య ఇసుకవాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రత్యామ్నాయ రహదారిని అత్యవసరంగా పునరుద్ధరించి రాకపోకలు పునఃప్రారంభించేలా తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఇసుకవాగులో వరద ప్రవాహం పెరగడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డు దెబ్బతింది. దీంతో తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను అనుసంధానించే జాతీయ రహదారి–163పై వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. వరద ఉధృతి తగ్గిన వెంటనే ప్రత్యామ్నాయ మార్గాన్ని పునరుద్ధరించి ట్రాఫిక్‌ను పునఃప్రారంభించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రమాదాలు జరగకుండా పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. ప్రస్తుతం వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో పైపులు దెబ్బతినకుండా డైవర్షన్ రోడ్డుకు ఇరువైపులా కాల్వలు తవ్వి నీటిని మళ్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరిశీలనలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, ఐటిడిఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో, ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో కొండా కృపాకర్ తదితరులు పాల్గొన్నారు.
