అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు:

భూపాలపల్లి సీఐ డి. నరేష్ కుమార్

భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ: భూపాలపల్లిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భూపాలపల్లి సీఐ డి. నరేష్ కుమార్ సూచించారు.

వర్షాల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు.

మెరుపులు, పిడుగులు పడే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాల వద్ద నిలబడవద్దని తెలిపారు. వరద నీరు నిలిచిన రహదారులు, వాగులు, చెరువులు దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు.

విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని, పిల్లలు, వృద్ధులు, దివ్యాంగుల భద్రతపై కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

వాహనదారులు వేగాన్ని నియంత్రించి హెడ్‌లైట్లు వెలిగిస్తూ అప్రమత్తంగా ప్రయాణించాలని తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.

అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే డయల్-100కు కాల్ చేయాలని సూచించారు. అలాగే పోలీసు అత్యవసర నంబర్లు 8712658110, 8712658120, 8712658121 లేదా భూపాలపల్లి పోలీస్ స్టేషన్ నంబర్ 8712658142ను సంప్రదించాలని సీఐ డి. నరేష్ కుమార్ తెలిపారు.