ఓటర్ల జాబితాల తయారీ పకడ్బందీగా నిర్వహించాలి..

గుంటూరు కలెక్టర్ సాయికాంత్ వర్మ


గుంటూరు,(ఆంధ్రప్రభ): పట్టభద్రులు, ఉపాధ్యాయులు, స్థానిక సంస్థల నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల జాబితాల తయారీ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు.

ఓటర్ల జాబితాల తయారీ ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాజేష్ కుమార్ సింగ్, రోహిత్ కుమార్, స్వతంత్ర కుమార్ మీనా, మల్లికార్జున్ రెడ్డితో కలిసి గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల ఎన్నికల నమోదు అధికారుల (ఈఆర్‌వోలు) సమావేశాన్ని బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల ఓటర్ల జాబితాల తయారీకి సంబంధించిన నిబంధనలు, అర్హతలు, దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, అభ్యంతరాల పరిష్కారం తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ సాయికాంత్ వర్మ మాట్లాడుతూ… ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను యథావిధిగా అమలు చేస్తూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో నమోదు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. దరఖాస్తులను నిబంధనల మేరకు క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి లోపాలకు తావులేకుండా ప్రక్రియను నిర్వహించాలని అన్నారు.

పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు ఓటర్లుగా నమోదు చేసుకునే వారి అర్హతను సంబంధిత విద్యార్హత ధ్రువపత్రాల ఆధారంగా నిర్ధారించాలని, ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా సాగాలని తెలిపారు. అలాగే స్థానిక సంస్థల నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల జాబితా తయారీలో కూడా ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులకు ఆదేశించారు. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ, క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ, వాటి పరిష్కారం, తుది ఓటర్ల జాబితా ప్రచురణ వంటి ప్రతి దశను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని, ఎన్నికల సంఘం సూచనలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్వో ఖాజావలి, జెడ్పీ సీఈఓ జ్యోతి బసు, డీపీఓ సాయి కుమార్, ఎన్నికల నమోదు అధికారులు (ఈఆర్‌వోలు), జిల్లా ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.