ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం: సీపీఐ
చిలకలూరిపేట, ఆంధ్రప్రభ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ప్రచార, ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ సుభాని తెలిపారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీ జాతీయ సమితి నిర్ణయం మేరకు ఆగస్టు 6 నుంచి 15 వరకు గ్రామాలు, పట్టణాల్లో విస్తృత ప్రచార కార్యక్రమాలు, ఆగస్టు 15 నుంచి 27 వరకు ప్రజా సంఘాలు, ఐక్య వేదికల ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ ఉద్యమాల్లో భాగంగా సెప్టెంబర్ 1న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా చేపట్టనున్నట్లు, చిలకలూరిపేట నుంచి కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు.
ఢిల్లీలో జరిగిన విద్యార్థి ఉద్యమం కార్పొరేట్ విద్యా విధానాలు, ‘నీట్’ పరీక్షలో అవకతవకలకు వ్యతిరేకంగా సాగుతోందని పేర్కొన్న ఆయన, పోటీ పరీక్షల పేపర్ లీకేజీలు, నిరుద్యోగ సమస్యలు, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత లోపాలు, ఓటర్ల జాబితాల తొలగింపులు వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. లడఖ్‌కు స్వయం ప్రతిపత్తి, మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు, పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు, రైతు సమస్యలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యం వంటి పలు అంశాలపై కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు.
సీపీఐ పట్టణ కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలు సీపీఐ చేపట్టిన ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలని కోరారు. సెప్టెంబర్ 1న ఢిల్లీలో జరిగే జంతర్ మంతర్ ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ నాయకులు ఏలిక శ్రీనివాసరావు, బొంత తిరుపతయ్య, దాసరి వరహాలు, బొంతా నాసర్, సయ్యద్ నానా, చౌటుపల్లి బాబు తదితరులు పాల్గొన్నారు.
