భద్రతలో ముందంజలో కేటీకే ఓసీ-2 ప్రాజెక్టు
భద్రతతో పాటు ఉత్పత్తిలోనూ మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించిన జీఎం రాజేశ్వర్ రెడ్డి
భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ: సింగరేణి భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఓసీ-2 ప్రాజెక్టు ఇటీవల నిర్వహించిన 56వ వార్షిక భద్రతా పక్షోత్సవం–2025లో ఓసీ మైన్స్ గ్రూప్–2 విభాగంలో ప్రథమ బహుమతి సాధించడంపై ఏరియా జనరల్ మేనేజర్ ఎ. రాజేశ్వర్ రెడ్డి అధికారులు, కార్మికులను అభినందించారు.
బుధవారం మొదటి షిఫ్ట్ ప్రారంభానికి ముందు గనిని సందర్శించిన ఆయన, ఈ అవార్డు ప్రతి ఉద్యోగి భద్రతా నిబంధనల పట్ల చూపిన అంకితభావం, సమిష్టి కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూనే నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి సాధించాలని సూచించారు.
ఇదే క్రమశిక్షణను కొనసాగిస్తూ భవిష్యత్తులో మరిన్ని భద్రతా అవార్డులు సాధించి భూపాలపల్లి ఏరియాకు, సింగరేణికి మరింత గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.
తాడిచెర్ల బ్లాక్-2ను సింగరేణికి కేటాయించడం సంస్థ అభివృద్ధిలో కీలక ముందడుగని జీఎం పేర్కొన్నారు. అలాగే పీవీఎన్ఆర్ ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు.
ఈ రెండు ప్రాజెక్టులు ప్రారంభమైతే భూపాలపల్లి ఏరియాలో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరిగి, సింగరేణిలో కీలక ఉత్పత్తి కేంద్రంగా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఓసీ-2 ప్రాజెక్టు అధికారులు, సేఫ్టీ సిబ్బంది, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
