గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి.. భక్తులతో కిటకిటలాడిన సాయిబాబా ఆలయం
వలిగొండ, ఆంధ్రప్రభ: మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గురువు ప్రాముఖ్యతను వివరించారు. గురువుల ఆశీస్సులతోనే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని, సమాజంలో గురువులకు తగిన గౌరవం ఇవ్వాలని పిలుపునిచ్చారు.
ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి, ప్రసాదాలను పంపిణీ చేశారు.
గురు పౌర్ణమి సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

